PBKS vs RCB, IPL 2023:
మొహాలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్తరు స్కోరే చేసింది. ఆతిథ్య పంజాబ్ కింగ్స్‌కు 175 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ వేదికలో యావరేజీ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ టోటల్ 186తో పోలిస్తే ఇది తక్కువే! ఓపెనర్లు డుప్లెసిస్ (84; 56 బంతుల్లో 5x4, 5x6), విరాట్ కోహ్లీ (59; 47 బంతుల్లో 5x4, 1x6) మాత్రం అదరగొట్టారు. అద్వితీయమైన హాఫ్ సెంచరీలు అందుకున్నారు. 16 ఓవర్ల వరకు వికెట్ ఇవ్వకుండా పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు పడగొట్టాడు.
16 ఓవర్ల వరకు నో వికెట్
టాస్ ఓడిన ఆర్సీబీకి అమేజింగ్ స్టార్ట్ ఇచ్చారు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్! మొదటి బంతి నుంచీ పాజిటివ్‌గా బ్యాటింగ్ చేశారు. పవర్‌ప్లేలో వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదేశారు. దాంతో బెంగళూరు 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 59 రన్స్ చేసింది. గాయపడ్డప్పటికీ డుప్లెసిస్ జోరు చూపించాడు. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. జస్ట్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దాంతో 70 బంతుల్లోనే ఆర్సీబీ 100కు చేరుకుంది. స్ట్రాటజిక్ టైమ్‌ఔట్ తర్వాత విరాట్ దూకుడుగా ఆడాడు. మొదటి నుంచీ డౌన్ ద గ్రౌండ్ వచ్చే షాట్లు బాదాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
స్లో బంతులతో తగ్గిన రన్‌రేట్
కోహ్లీ, డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 98 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యం అందించారు. వరుస బంతుల్లో వికెట్లు పడటంతో ఆర్సీబీ స్కోరు నెమ్మదించింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 16.1వ బంతికి విరాట్ కోహ్లీ లెగ్‌సైడ్ ఆడబోయి కీపర్ జితేశ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతినే భారీ షాట్ ఆడబోయిన మాక్స్‌వెల్ (0) టెయిడ్‌కు చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే నేథన్ ఎలిస్ బౌలింగులో డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ లోమ్రర్ (7), షాబాజ్ అహ్మద్ (5) మెరుపులేమీ లేకపోవడంతో ఆర్సీబీ 174/4కు పరిమితం అయింది.