IPL 2023, MS Dhoni:
ఎంఎస్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాకు సరిపోడని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు. కెప్టెన్సీ కోసమే అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడని గుర్తు చేశాడు. నాయకుడిగా అతడి అవసరం 20 ఓవర్లూ ఉంటుందన్నాడు. ఒకవేళ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే భవిష్యత్తులోనూ సారథిగా కొనసాగుతాడే కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండడని అంచనా వేశాడు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ నేపథ్యంలో వీరూ మాట్లాడాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ (MS Dhoni) మొదటి ఆటగాడిగా ఉంటాడని లేదంటే రిటైర్మెంట్ తీసుకుంటాడని వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అంటున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ క్రైటీరియాకు అతడు సరిపోడని పేర్కొన్నాడు. 'పూర్తి ఫిట్‌నెస్ ఉంటే 40 ఏళ్ల తర్వాత క్రికెట్ ఆడటం కష్టమేమీ కాదు. ఈ ఏడాది ఎంఎస్ ధోనీ సామర్థ్యం మేరకు బ్యాటింగ్ చేయలేదు. మోకాలి గాయాన్ని పెద్దది చేసుకోవాలని అతడు కోరుకోవడం లేదు. తరచుగా అతడు ఆఖరి రెండు ఓవర్లు ఆడేందుకే క్రీజులోకి వస్తున్నాడు. ఈ సీజన్లో అతడు ఎదుర్కొన్న బంతుల్ని లెక్కపెడితే 40-50 కన్నా ఎక్కువేం ఉండవు' అని వీరూ అన్నాడు.
Also Read: మొతేరాలో ఫైనల్ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్, నెగెటివ్స్ ఇవే!
'ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎంఎస్ ధోనీకి నప్పదు. ఎందుకంటే అతడు కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడు. నాయకత్వం కోసం అతడు మైదానంలో కచ్చితంగా ఉండాలి. బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్‌కు రాకుండా, బౌలింగ్ చేసి బ్యాటింగ్‌కు రాకుండా ఉండేవాళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. ధోనీ కచ్చితంగా 20 ఓవర్లు మైదానంలో ఉండాల్సిందే. అతడు కెప్టెనే కానప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకు ఆడతాడు? అలాంటప్పుడు అతడిని మెంటార్ లేదా కోచ్ లేదా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా చూడొచ్చు' అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయంతో విభేదించాడు. ఎంఎస్ ధోనీ భవిష్యత్తులో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఉపయోగపడుతుందని అంటున్నాడు. దీంతో అతడి కెరీర్‌ను పొడగించుకోవచ్చని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో మహీ మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక మ్యాచులో తనను ఎక్కువగా పరుగెత్తించొద్దని రవీంద్ర జడేజాకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ రిజర్వు డేకు మారిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం ఆడలేదు. ఇకపై సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సోమవారం ఫైనల్‌కు రిజర్వ్ అయింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం ఆటను చెడగొట్టింది. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా చాలా సేపు వర్షం ఆగుతుందా అని ఎదురుచూశారు. కానీ వర్షం ఆగలేదు.