Mohsin Khan, IPL 2023: 


ముంబయి ఇండియన్స్‌పై విజయాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నానని లక్నో సూపర్‌ జెయింట్స్‌ యువ పేసర్‌ మొహిసిన్‌ ఖాన్‌ అన్నాడు. ఆయన ఐసీయూ నుంచి సోమవారమే డిశ్చార్జీ అయ్యారని చెప్పాడు. గుజరాత్‌పై ఎక్కువ పరుగులు ఇచ్చినా తనపై నమ్మకం ఉంచినందుకు ఎల్‌ఎస్‌జీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. గౌతమ్‌గంభీర్‌, విజయ్‌ దహియా తనపై విశ్వాసం ఉంచారని వెల్లడించాడు. మ్యాచ్‌ తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


'మా నాన్న పది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. ఐసీయూలో చికిత్స పొందారు. సోమవారమే ఇంటికి వచ్చారు. బహుశా ఈ మ్యాచ్‌ను టీవీలో చూసుంటారు. ఆయన కోసమే ఈ మ్యాచ్‌ ఆడుతున్నా. బాగా సంతోషించే ఉంటారు' అని మొహిసిన్‌ అన్నాడు.






ముంబయి విజయానికి ఆరు బంతుల్లో 11 పరుగులు అవసరం కాగా ఆఖరి ఓవర్లో మొహిసిన కేవలం 6 పరుగులే ఇచ్చాడు. భీకరమైన టిమ్‌ డేవిడ్‌, కామెరాన్‌ గ్రీన్‌ను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అడ్డుకున్నాడు. బౌండరీలు కొట్టకుండా నిలువరించాడు. ఈ సీజన్లో అతడికిది రెండో మ్యాచే! నిజానికి చివరి సీజన్లో 9 మ్యాచుల్లో 5.97 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత భుజం గాయం కావడంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. 2023లోనూ సగం సీజన్‌ ఆడలేదు. గుజరాత్‌పై 3 ఓవర్లు వేసి 42 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ముంబయిపై తొలి రెండు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చినా ఆఖరి ఓవర్లో మాత్రం అమేజింగ్‌ అనిపించాడు.


'నేను చాలా గడ్డు కాలం అనుభవించాను. ఒకానొక దశలో క్రికెట్‌పై ఆశలు వదిలేసుకున్నాను. ఎందుకంటే కనీసం చెయ్యెత్తే పొజిషన్లో లేను. ఇక బౌలింగ్‌ గురించి మర్చిపోవాల్సిందే. నా చేతిని సరిగ్గా చాచలేకపోయేవాడిని. ఫిజియోతో పాటు వైద్యులు శ్రమించారు. ఇంకొక్క నెల రోజులు ఆలస్యమైతే నా చెయ్యి తీసేయాల్సి వచ్చేదని వైద్యులు చెప్పారు. గాయం విషయానికి వస్తే.. ఇలాంటిది ఇంకే క్రికెటర్‌కు అవ్వకూడదు. చాలా ప్రమాదకరమైన గాయమిది. ధమనులు, సిరలు రెండూ బ్లాక్‌ అయ్యాయి' అని మొహిసిన్‌ అన్నాడు.






'ప్రాక్టీస్‌లో ఏం చేస్తానో మ్యాచులోనూ ఇదే చేశా. నా బలమే అది. కృనాల్‌ భయ్యా నా దగ్గరికి వచ్చి ఏం చేస్తావని అడిగాను. ఇప్పటి వరకు ఏం చేస్తున్నానో అదే చేస్తానని చెప్పా. స్కోర్‌ బోర్డు చూడకుండా ప్రశాంతంగా ఉన్నాను. జస్ట్‌ ఆరు బంతులు వేస్తే చాలని చెప్పుకున్నాను. ముంబయికి 10 రన్స్‌ కావాలా 11 కావాలా అని పట్టించుకోలేదు. వికెట్‌ గ్రిప్‌ అవుతుండటంతో స్లోవర్‌ బాల్స్‌ వేశాను. తొలి రెండు బంతులు బీట్‌ అవ్వడంతో నెమ్మదిగా యార్కర్లు వేశాను. బంతి కాస్త రివర్స్‌ స్వింగ్‌ కూడా అయింది. జట్టు యాజమాన్యం నాపై నమ్మకం ఉంచినందుకు సంతోషం. చివరి మ్యాచులో బాగా ఆడకున్నా ముంబయిపై తీసుకున్నారు. గౌతమ్‌, విజయ్‌, సపోర్ట్‌ స్టాఫ్‌కు కృతజ్ఞతలు' అని మొహిసిన్‌ పేర్కొన్నాడు.


Also Read: ప్లేఆఫ్‌ బెర్తులు 3 కాంపిటీటర్లు 7 - ఎవ్వరూ సేఫ్‌ కాదు!