Ravindra Jadeja CSK:

  చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మధ్య విభేదాలు ఉన్నాయన్న అంచనాలు తప్పాయి. జడ్డూను చెన్నై రీటెయిన్ చేసుకోవటంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. 


2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా రవీంద్ర జడేజా నియమితుడయ్యాడు. అయితే ఆ ఏడాది జట్టును నడిపించడంలోనూ, ఆటగాడిగానూ విఫలమయ్యాడు. లీగ్ సగం పూర్తయ్యాక జట్టు పగ్గాలు మళ్లీ ధోనీనే తీసుకున్నాడు. తర్వాత జడేజా గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసింది. 


అంచనాలు తారుమారు


ఈ క్రమంలో జడేజాకు, చెన్నై యాజమాన్యానికి విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు జడ్డూ తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి చైన్నై జట్టుకు సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేయడం ఆ వార్తలకు బలాన్నిచ్చింది. 2023 సీజన్ కు జడేజాను చెన్నై రీటెయిన్ చేసుకోదని... అతన్ని వేలంలోకి వదిలేస్తుందని అందరూ అంచనాకు వచ్చారు. అయితే మంగళవారం చెన్నై అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో జడేజా పేరు చూసి అంచనాలన్నీ తారుమారయ్యాయి. 


రీస్టార్ట్


చెన్నై తనను రీటెయిన్ చేసుకున్న అనంతరం జడ్డూ తన ట్విటర్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ధోనీతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ... 'ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.. రీస్టార్ట్'  (అంతా బాగానే ఉంది) అని క్యాప్షన్ పెట్టాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా తన సామాజిక మాధ్యమ ఖాతాలో జడేజాను ఉద్దేశించి ఒక సరదా పోస్టును పెట్టింది. 'ఎయిత్ వండర్  టూ స్టే విత్ అజ్' (నువ్వు మాతో ఉండడం ఎనిమిదో వింత) అని వ్యాఖ్యతో కూడిన జడ్డూ ఫొటోను పంచుకుంది.


మొత్తానికి చెన్నై తో జడేజా బంధం కొనసాగనుంది. సూపర్ కింగ్స్ విజయాల్లో ఈ ఆల్ రౌండర్ కీలకపాత్ర పోషించాడు. బ్యాటర్ గా, బౌలర్ గా, ఫీల్డర్ గాా రాణించే జడేజా జట్టులో ఉండడం చెన్నైకు బలం. అందుకే ఆ జట్టు జడ్డూను అట్టిపెట్టుకుంది. మోకాలి గాయంతో టీ20 ప్రపంచకప్ కు దూరమైన జడేజా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. 


చెన్నై రిలీజ్ చేసిన ఆటగాళ్లు


డ్వైన్ బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జొర్డాన్, ఎన్‌. జగదీశన్, సి. హరినిశాంత్, కే. భగత్‌ వర్మ, కేఎం. అసిఫ్, రాబిన్ ఉతప్ప (రిటైర్డ్‌)ను రిలీజ్‌ చేసింది. 


అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు


ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, అంబటి రాయుడు, శుభ్రాన్షు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్‌ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, తుషార్‌ దేశ్‌పాండే, రాజ్‌వర్థన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, మహీషా పతిరాన.