MS Dhoni:
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్రంగా మందలించాడు. ఇకపై నోబాల్స్, వైడ్లు, ఎక్స్‌ట్రాలు ఇవ్వొద్దని సీరియస్‌గా హెచ్చరించాడు. మున్మందు ఇలాగే బౌలింగ్ చేస్తే మరో కెప్టెన్‌ను చూసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
ఒకప్పటితో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పేలవంగా మారింది. యువ పేసర్లు ఒత్తిడికి లోనవుతున్నారు. బ్యాటర్లు సిక్సర్లు కొడతారేమోనన్న భయంతో వైడ్లు, నో బాల్స్ వేస్తున్నారు. లక్నో మ్యాచులో దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే వరుసగా వైడ్లు, నోబాల్స్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పోరులో సీఎస్కే మొత్తం 18 ఎక్స్‌ట్రాలు ఇచ్చింది. 2 లైగ్‌బైస్, 13 వైడ్లు, 3 నోబాల్స్ వేసింది. గుజరాత్ టైటాన్స్ మ్యాచులోనూ 6 లెగ్‌బైస్, 4 వైడ్లు, 2 నోబాల్స్ వేయడం గమనార్హం.
'మేం ఫాస్ట్ బౌలింగ్‌లో మెరుగవ్వాలి. కండీషన్స్‌ను బట్టి బౌలింగ్ చేయాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారో ఓ కన్నేయాలి. మేం అస్సలు నోబాల్స్, వైడ్లు వేయకుండా ఉండటం అన్నిటి కన్నా ముఖ్యం. తర్వాతి మ్యాచులోనూ ఇలాగే చేస్తే మాత్రం కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది. ఇది నా రెండో హెచ్చరిక. ఆ తర్వాత నేను వెళ్లిపోతా' అని ఎంఎస్ ధోనీ అన్నాడు.
'చిదంబరం పిచ్ ప్రవర్తించిన తీరు సర్‌ప్రైజ్ చేసింది. నిజంగా ఇదో టెరిఫిక్ గేమ్. పెద్ద స్కోర్లు వచ్చాయి. మేమంతా వికెట్ ఎలా ఉంటుందోనని అనుకున్నాం. భారీ స్కోర్లు రావడంతో మేం సందేహపడ్డాం. ఏదేమైనా చెపాక్‌లో తొలి మ్యాచ్ సూపర్ హిట్టైంది. ఐదారేళ్ల తర్వాత స్టేడియం మొత్తం నిండింది' అని మహీ పేర్కొన్నాడు.
'నిజానికి చెపాక్ వికెట్ స్లోగా ఉంటుందనే భావించా. పరుగులు చేయొచ్చు కానీ పిచ్ అయితే నెమ్మదిగానే ఉంటుంది. మిగిలిన ఆరు మ్యాచుల్లో ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. మంచి స్కోర్లే చేస్తామని ధీమాగా ఉన్నాను. ఒకవేళ ఫ్లాట్‌గా ఉన్నా ఫీల్డర్ల మీద నుంచి కొట్టేలా బ్యాటర్లను ఫోర్స్ చేయాలి' అని ధోనీ తెలిపాడు.
IPL 2023, CSK vs LSG:
చెన్నై సూపర్ కింగ్స్ మురిసింది! చెపాక్‌లో సొంత అభిమానులను మైమరిపించింది. లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ను 205/7కు పరిమితం చేసింది. మొయిన్ అలీ (4/26) ప్రత్యర్థి దూకుడును దెబ్బతీశాడు. కైల్ మేయర్స్ (53; 22 బంతుల్లో 8x4, 2x6) వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. నికోలస్ పూరన్ (32; 18 బంతుల్లో 2x4, 3x6) మెరిశాడు. అంతకు ముందు సీఎస్‌కేలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57; 31 బంతుల్లో 3x4, 4x6), డేవాన్ కాన్వే (47; 29 బంతుల్లో 5x4, 2x6), శివమ్ దూబె (26; 13 బంతుల్లో 2x4, 2x6) దంచికొట్టారు.