Arjun Tendulkar, IPL 2023: 


ముంబయి ఇండియన్స్‌కు షాక్‌! యువ పేసర్‌ అర్జున్‌ తెందూల్కర్‌ను కుక్క కరిచింది! అతడు బౌలింగ్‌ చేసే చేతినే కరవడంతో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచులు ఆడలేకపోతున్నాడు. మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచులోనూ అతడిని మనం చూడకపోవచ్చు.


ఏకనాలో నేడు ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants vs Mumbai Indians) ఢీకొంటున్నాయి. వీరిద్దరికీ ఇది అత్యంత కీలక మ్యాచ్‌. ఇందులో గెలిచిన జట్టు దాదాపుగా ప్లేఆఫ్‌ చేరుకున్నట్టే అనుకోవచ్చు! హిట్‌మ్యాన్‌ సేన విజయం అందుకుంటే 16 పాయింట్లతో రెండో ప్లేస్‌కు వెళ్తారు. కృనాల్‌ సేన గెలిస్తే 15 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకుతారు.






ఈ మ్యాచ్‌ కోసం ముంబయి ఇండియన్స్‌ లక్నోకు చేరుకుంది. ప్రాక్టీస్‌ సమయంలో అర్జున్‌ తెందూల్కర్‌ను (Arjun Tendulkar) యువ పేసర్లు యుధ్‌వీర్‌ సింగ్‌, మొహిసిన్ ఖాన్ పలకరించారు. అప్పుడే తనను కుక్క కరిచిన విషయాన్ని అర్జున్‌ బయటకు చెప్పాడు.


'చాలా రోజులకు కలిశా! ఎలా ఉన్నావ్‌! అంతా బాగానే ఉందా' అని యుధ్‌వీర్‌ ప్రశ్నించాడు. దానికి 'కుక్క కరిచింది' అని అర్జున్‌ బదులిచ్చాడు. 'ఎప్పుడు' అని యుధ్‌వీర్ అడగ్గా 'నిన్న' అంటూ జూనియర్‌ తెందూల్కర్‌ స్పందించాడు. ఆ తర్వాత మొహిసిన్‌ ఖాన్‌ అతడిని పలకరించాడు 'హౌ ఆర్‌ యు మై బ్రదర్‌! బాగున్నావా.. నీ బౌలింగ్‌తో చంపేస్తున్నావ్‌గా. ప్రాక్టీస్‌ తర్వాత కలుద్దాం' అని చెప్పగా అర్జున్‌ నవ్వుతూ ఆలింగనం చేసుకున్నాడు.






ఇండియన్‌  ప్రీమియర్‌ లీగులో అర్జున్‌ తెందూల్కర్‌ ఈ సీజన్లోనే అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడాడు. మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. 30.66 సగటు, 9.35 ఎకానమీతో ఉన్నాడు. అలాగే 13 పరుగులూ చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అతడికి మంచి అనుభవమే ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతడిని ఎక్కువగా పవర్‌ప్లేలో వినియోగించాడు. బంతి స్వింగ్‌ చేయగల సామర్థ్యం ఉండటమే ఇందుకు కారణం.


Also Read: జూబ్లీహిల్స్‌లో సిరాజ్‌ కొత్తిల్లు - కోహ్లీ సహా ఆర్సీబీ సర్‌ప్రైజ్‌ విజిట్‌!


ప్రాక్టీస్‌ సమయంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు సరదాగా గడిపారు. ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్ గంభీర్‌తో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆప్యాయంగా మాట్లాడాడు. వీరిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం! అలాగే వెస్టిండీస్‌ పొడగరి కీరన్‌ పొలార్డ్‌తో కృనాల్‌ పాండ్య మాట్లాడాడు.






ఈ  సీజన్‌లో   12 మ్యాచ్‌లు ఆడి గత రెండు మ్యాచ్‌లలో బ్యాక్ టు బ్యాక్  విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని టాప్ -3కి ఎగబాకింది ముంబై. ఆ జట్టుకు బలమంతా బ్యాటింగే.  కెప్టెన్ రోహిత్ విఫలమవుతున్నా ఇషాన్ కిషన్ అంతంతమాత్రంగానే ఆడుతున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం  బీస్ట్ మోడ్ లో ఉన్నాడు.  ఇటీవలే గుజరాత్ తో మ్యాచ్ లో సెంచరీ బాది జోరు మీదున్న సూర్య‌కు నెహల్ వధేరా, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ లు కూడా జతకలిస్తే ముంబైకి తిరుగుండదు. గుజరాత్ తో మ్యాచ్ లో  సూర్యతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన విష్ణు వినోద్ కూడా  నేటి మ్యాచ్ లో రాణించాలని ముంబై  కోరుకుంటున్నది.