ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం మీద అతిపెద్ద సర్ ప్రైజ్ ఎవరైనా ఉన్నారూ అంటే అది కచ్చితంగా సీఎస్కే బ్యాటర్ అజింక్య రహానే. ఎవరూ ఊహించని ప్యాకేజ్ లా వచ్చాడు. అసలు రహానే.... టీంలోకి అనుకోకుండా వచ్చాడు. ముంబయితో మ్యాచ్ లో మొయిన్ అలీ అందుబాటులోకి లేకపోయేసరికి వన్ డౌన్ లో రహానే లాంటి ప్లేయర్ అవసరం వచ్చింది.
మొదటి మ్యాచ్ లోనే రెచ్చిపోయాడు జింక్స్. 27 బాల్స్ లో 61. ఇక అక్కడ్నుంచి ప్రతి మ్యాచ్ లోనూ అదరగొట్టేస్తున్నాడు. నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో ఇంకో లెవెల్ కు చేరింది ఆట. 29 బంతుల్లో 71 నాటౌట్. 6 ఫోర్లు, 5 సిక్సులతో 245 స్ట్రైక్ రేట్. అస్సలు రహానే కెరీర్ లో ఎప్పుడూ ఆడని షాట్లు కూడా నిన్న చూశాం. థర్డ్ మ్యాన్ మీదగా ఓ ర్యాంప్ షాట్ ఆడాడు. ఆ షాట్ చూస్తే... అసలు రహానేనా అని అనిపిస్తుంది. ఆ రేంజ్ లో తనలో కొత్త కోణాని చూపిస్తున్నాడు.
నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా కొట్టేశాడు రహానే. అప్పుడు మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మహీ భాయ్ కెప్టెన్సీలో ఇండియాకు చాలా ఏళ్లు ఆడానని, ఇప్పుడు ఇక్కడ ఇంకా నేర్చుకుంటానని అన్నాడు. ధోనీ చెప్పింది వింటే చాలు.... కచ్చితంగా ప్రతిసారీ పర్ఫార్మ్ చేసేస్తామని చెప్పాడు.
ఇక తన బ్యాటింగ్ గురించి చెప్తూ.... ప్రతి ఇన్నింగ్స్ ఎంజాయ్ చేశానని, కానీ తనలో అసలైన ఆట ముందుందీ అంటూ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు రహానే. ఈ సీజన్ లో ఇప్పటిదాకా 5 మ్యాచెస్ లో 209 పరుగులు చేసిన రహానే.... 52 యావరేజ్ తో, 199 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. స్ట్రైక్ రేట్.... సీజన్ లో ఇప్పటిదాకా తనదే అత్యధికం.
ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 235 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితం అయింది.
కోల్‌కతా బ్యాటర్లలో జేసన్ రాయ్ (61: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రింకూ సింగ్ (53 నాటౌట్: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. కానీ వారికి మిగతా టీమ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే... విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే (71 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానే 245 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. శివం దూబే (50: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు), డెవాన్ కాన్వే (56: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 18 సిక్సర్లు కొట్టడం విశేషం.
మొదట బ్యాటింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మొదటి బంతి నుంచే బౌండరీలతో చెలరేగారు. వీరి బ్యాటింగ్‌తో చెన్నై పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు సాధించింది. అయితే సుయాష్ శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వీరు మొదటి వికెట్‌కు 73 పరుగులు జోడించారు.
రెండో వికెట్‌కు రహానేతో కలిసి 36 పరుగులు జోడించిన అనంతరం డెవాన్ కాన్వే కూడా అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి చెన్నై బ్యాటింగ్ టాప్ గేర్‌కు వెళ్లిపోయింది. అజింక్య రహానే, శివం దూబే ఇద్దరూ శివాలెత్తిపోయినట్లు ఆడారు. వీరు మూడో వికెట్‌కు కేవలం 32 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. ఆ తర్వాత శివం దూబే అవుటైనా రవీంద్ర జడేజా కూడా సిక్సర్లతో చెలరేగాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో కుల్వంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.