IPL 2022: ఐపీఎల్‌ 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఆటతీరు చూస్తుంటే ఫ్యాన్స్‌కు బాధేస్తోంది! బౌలింగ్‌లో అదరగొడుతున్న జట్టు బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతోంది. పదేపదే ఒకే తరహా పొరపాట్లు చేస్తూ ఓటముల పాలవుతోంది. గెలవాల్సిన మ్యాచులూ ఓడిపోతుంటే కోచులు సహా ఓనర్ కావ్యా మారన్‌ ముఖాల్లో ఆనందమే కనిపించడం లేదు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గత సీజన్లో సన్‌రైజర్స్‌ (SRH) ఆటను చూసే అభిమానులు ఎంతో విమర్శించారు. డేవిడ్‌ వార్నర్‌తో విభేదాలు రావడం, అతడు జట్టును వీడిపోవడంతో చాలా వరకు ఫ్యాన్స్‌ SRH మ్యాచుల్ని చూసేందుకు ఇష్టపడటం లేదు! సరే కేన్‌ మామ ఉన్నాడు కదా! అనుకుంటూ మ్యాచులు చూద్దామంటే జట్టు ఎంపిక, ఓటములు నిరాశపరుస్తున్నాయి.


ఐపీఎల్ మెగా వేలం నుంచి సన్‌రైజర్స్‌పై అభిమానులకు పెద్దగా అంచనాలేమీ లేవు. ఎందుకంటే వారు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తీరే నచ్చలేదు. స్టార్‌ క్రికెటర్లను పక్క జట్లు లాగేసుకుంటుంటే హైదరాబాద్‌ వ్యూహ బృందం మాత్రం అవేమీ పట్టనట్టు కూర్చుంది. దాంతో ఫ్యాన్‌ బేస్‌ తగ్గిపోయింది. కనీసం అంబటి రాయుడు (Ambati Rayudu), తిలక్‌ వర్మ (Tilak varma), కేఎస్‌ భరత్‌ (KS Bharat) వంటి లోకల్‌ ప్లేయర్లను తీసుకుందా అంటే అదీ లేదు. పాత ఆటగాళ్లనే తీసుకుంది.


సరైన ఆటగాళ్లను తీసుకోకపోవడం వల్ల సన్‌రైజర్స్‌ తుది జట్టు కూర్పు కుదరడం లేదు. వాళ్లిప్పుడు వేరేవాళ్లనీ తీసుకొనే ఛాన్స్‌ లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ తుది జట్టు కూర్పే ఎవరికీ అర్థమవ్వడం లేదు. టాప్‌ ఆర్డర్‌ నుంచి మిడిలార్డర్‌ వరకు అనుభవ లేమి కనిపిస్తోంది. ఒత్తిడికి చిత్తయ్యే వాళ్లే ఉన్నారు. పైగా వాళ్ల బ్యాటింగ్‌ ఆర్డర్‌ విచిత్రంగా అనిపిస్తోంది.


దేశవాళీ క్రికెట్లో అభిషేక్‌ శర్మ ఓపెనింగ్‌ చేశాడు. అయితే మరీ ఎక్కువ మ్యాచులేమీ ఆడలేదు. లెఫ్ట్‌ హ్యాండర్‌ కాబట్టి ఓపెనింగ్‌కు పంపిస్తున్నారు. అతడితో పాటు కేన్‌ విలియమ్సన్‌ వస్తున్నాడు. నిజానికి కేన్‌ మామ వన్‌డౌన్‌లో ది బెస్ట్‌! కానీ ఇక్కడ అభిషేక్‌ను ప్రత్యర్థి జట్టు ఔట్‌ చేయడంతో ఒత్తిడి ఎదురవుతోంది. దాంతో మిడిలార్డర్‌ ఒత్తిడి ఎదుర్కొంటోంది. అసలు మ్యాచ్‌ ఫినిషర్లు లేకపోవడం ఈ జట్టు కొరత. విదేశీ ఆటగాళ్లున్నా డైరెక్టుగా వచ్చి సిక్సర్లు కొట్టి గెలిపించే వాళ్లు తక్కువ. ఇప్పటికైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారిస్తే బెటర్‌.


రాహుల్‌ త్రిపాఠి ఓపెనింగ్‌ అద్భుతంగా చేయగలడు. గతంలో పుణె సూపర్‌జెయింట్స్‌ తరఫున మెరుపులు మెరిపించాడు. పైగా అతడి అనుభవం చాలా ఎక్కువ.  మంచి స్ట్రోక్‌ ప్లేయర్‌. పవర్‌ ప్లేలో సునాయాసంగా సిక్సర్లు, బౌండరీలు బాదేస్తాడు. అంత సులభంగా వికెట్‌ ఇవ్వడు. అతడికి తోడుగా అయిడెన్‌ మార్‌క్రమ్‌ను పంపిస్తే బెటర్‌. అంతర్జాతీయంగా అతడికి అనుభవం ఉంది. ఓపెనర్‌గా ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు మిడిలార్డర్‌లో అవసరం అనుకుంటే, లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కావాలంటే వాషింగ్టన్‌ సుందర్‌ను ఓపెనర్‌గా పంపించొచ్చు. ఇదో మంచి ప్రయోగమే అవుతుంది. దేశవాళీ, టీఎన్‌పీఎల్‌లో అతడు ఓపెనింగే చేస్తాడు.


కేన్‌ వన్‌డౌన్‌లో రావాలి. అప్పుడతను మరో వికెట్‌ పడకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగలడు. ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌, అబ్దుల్‌ సమద్‌, షెఫర్డ్‌ వస్తారు. సమద్‌ ఎప్పుడూ తన స్థాయిక తగినట్టైతే ఆడలేదు. రెండు సిక్సర్లు కొట్టి పెవిలియన్‌ వెళ్లిపోతాడు. ఇక పూరన్‌లో ఎంతో ఫైర్‌, పవర్‌, టాలెంట్‌ ఉన్నా కొన్ని వీక్‌నెస్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. స్పిన్నర్లు, షార్ట్‌ పిచ్‌ బంతుల్ని ఆడుతూ ఔటవుతుంటాడు. నిలకడ లోపం ఎక్కువ. ఏదేమైనా మంచి ఫినిషర్‌ మాత్రం ఈ జట్టుకు ఈ సీజన్లో లేనట్టే! మిగతా మార్పులైనా చేస్తే ఫ్యాన్స్‌ సంతోషిస్తారు.