ఐపీఎల్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరనుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది.


ఇక లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లూ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయర్-1 ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడనుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1 విజేతతో ఫైనల్ ఆడనుంది.


మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ముగిసిపోనుంది. ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లలో రాజస్తాన్ ఒక్కసారి మాత్రమే టైటిల్ విజేతగా నిలిచింది. లక్నో, గుజరాత్ జట్లు ఈ సీజన్‌లోనే ఎంట్రీ ఇచ్చాయి. బెంగళూరు ఐపీఎల్ కప్ కోసం చేసే పోరాటం గురించి ఎవరికీ తెలియనిది కాదు. కాబట్టి ఈసారి కొత్త విజేతను చూసే అవకాశం ఎక్కువ ఉంది.


ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్
క్వాలిఫయర్-1: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ (మే 24వ తేదీన రాత్రి 7:30 గంటలకు)
ఎలిమినేటర్: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (మే 25వ తేదీన రాత్రి 7:30 గంటలకు)
క్వాలిఫయర్-2: క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు (మే 27వ తేదీన రాత్రి 7:30 గంటలకు)
ఫైనల్: క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు వర్సెస్ క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు (మే 27వ తేదీన రాత్రి 7:30 గంటలకు)