IPL 2022 Mumbai Indians costly mistakes in auction makes team spineless : ముంబయి ఇండియన్స్‌! ఐదుసార్లు ఛాంపియన్‌. అరివీర భయంకరులైన హిట్టర్లకు డెన్‌ అది. భీకరమైన పేస్‌, మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే కోట అది. చిన్ని చిన్న టార్గెట్లను డిఫెండ్‌ చేసుకొని ట్రోఫీలు గెలిచిన జట్టది. అలాంటిది 170+ స్కోర్లను రక్షించుకోలేకపోతోంది. 180+ టార్గెట్లను ఛేజ్‌ చేయలేక చేతులెత్తేస్తోంది. IPL 2022లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది? ఇంతకీ హిట్‌మ్యాన్‌ సేన లెక్క ఎక్కడ తప్పింది?


అక్కడే తప్పు చేశారు!


తక్కువ ధరకే యువకులను కొనుగోలు చేసి సానపట్టడంలో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు తిరుగులేదు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో దానికి స్కౌటింగ్‌ ప్రోగ్రామ్‌ ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏ కుర్రాడైనా రాణిస్తే చాలు అతడిపై కన్నేస్తుంది. ఇక మెరుగైన సీనియర్‌ క్రికెటర్లను దక్కించుకోవడంలోనూ వారికి ఎదురులేదు. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టైనా మ్యాచ్‌ విన్నర్లను కొనుగోలు చేసేది. సచిన్‌ తెందూల్కర్‌, మహేళా జయవర్ధనె, జహీర్‌ ఖాన్‌ వంటి ఉద్దండులు వారి వ్యూహబృందంలో ఉన్నారు. అలాంటిది ఈ సీజన్లో వారు ఎలా పప్పులో కాలేశారో? ఎక్కడ దారి తప్పారో చూడండి. ఒక చిన్న మిస్‌ కాల్కులేషన్‌ వారిని కోలుకోలేని దెబ్బతీసింది.


ఇషాన్‌ కోసం!


వేలానికి ముందు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కీరన్‌ పొలార్డ్‌ను ముంబయి ఇండియన్స్‌ రీటెయిన్‌ చేసుకుంది. అప్పటికే వారివద్ద డబ్బు చాలా వరకు ఖర్చైపోయింది. అయినప్పటికీ మిగిలిన డబ్బుతో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. కానీ వారు ఇషాన్‌ కిషన్‌ను తీసుకోవడమే లక్ష్యంగా వేలంలోకి దిగారు. ఇదే వారి కొంప ముంచింది. నిజానికి వేలంలో కిషన్‌కు చాలా డిమాండ్‌ ఉంది. ఇతర ఫ్రాంచైజీలు ఎంత డబ్బైనా పెట్టేందుకు సిద్ధపడేలా ఉన్నారు. దాంతో వేలంలో అతడి పేరు వచ్చేంత వరకు ముంబయి సైలెంట్‌గా కూర్చుండిపోయింది. దేశవాళీ క్రికెటర్లు, స్టార్లను ఇతర జట్లు దక్కించుకుంటున్నా స్పందించలేదు.


బుమ్రాకు పార్ట్‌నర్‌ లేడు


ఐపీఎల్‌ 2022లో ముంబయి ఇండియన్స్‌ ఆత్మవిశ్వాసాన్ని ప్రధానంగా దెబ్బతీస్తోంది బౌలింగే! పేరుకేమో విదేశీ ఆల్‌రౌండర్లను కోట్లు పెట్టికొన్నారు. వారికి అండగా నిలిచిన క్రికెటర్లపై శీతకన్నేశారు. జస్ప్రీత్‌ బుమ్రాకు తోడుగా ట్రెంట్‌ బౌల్ట్‌ ఉన్నప్పుడు పవర్‌ప్లేలో వారిని ఎదుర్కోవడానికి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేది. అలాంటిది ఇప్పుడసలు వికెట్లే పడటం లేదు. ఎడమ చేతి వాటంతో బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసే బౌల్ట్‌ను తీసుకోకపోవడం ముంబయి చేసిన అతిపెద్ద తప్పిదం. రాజస్థాన్‌ అతడిని రూ.8 కోట్లకు దక్కించుకుంది.


మలుపు తిప్పని స్పిన్‌


రెండుసార్లు ముంబయి అతి తక్కువ టార్గెట్లను డిఫెండ్‌ చేసుకొని ట్రోఫీలు గెలవడంలో రాహుల్‌ చాహర్‌, కృనాల్‌ పాండ్య స్పిన్‌ ఎంతో ఉపయోగపడింది. మధ్య ఓవర్లలో వీరు పరుగుల్ని నియంత్రించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేసేవారు. డాట్‌ బాల్స్‌ ఎక్కువవ్వడం వల్ల పెద్ద షాట్లకు పోయి బ్యాటర్లు ఔటయ్యేవారు. ఈ సారి ముంబయిలో అలాంటి స్పిన్‌ అటాకే లేదు. మురుగన్‌ అశ్విన్‌ మంచి స్పిన్నరే అయినా పరుగులు నియంత్రించడం కష్టం. మయాంక్‌ మర్కండేకు ఇప్పటి వరకు జట్టులో చోటే దక్కలేదు. దాంతో స్పిన్‌ ఆప్షన్లే లేకుండా పోయాయి. రాహుల్‌ చాహర్‌ను పంజాబ్‌ రూ.5.25 కోట్లకే దక్కించుకుంది.


డబ్బంతా విదేశీ ఆల్‌రౌండర్లకు


కేవలం ఇషాన్‌ కోసం వేలంలో ముంబయి అతిపెద్ద పొరపాట్లు చేసింది. అతడి కోసం రూ.16-18 కోట్లు పెట్టేందుకు సిద్ధపడింది. అతడి పేరు వచ్చేంత వరకు ప్రధాన ఆటగాళ్లను తీసుకోనే లేదు. దాంతో బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, కృనాల్‌ను వేరే జట్లు తీసేసుకున్నాయి. దాంతో గతిలేక బాసిల్‌ థంపి, జయదేవ్‌ ఉనద్కత్‌, మయాంక్‌ మర్కండే, మురుగన్‌ అశ్విన్‌ను తీసుకుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సీజన్‌ మొత్తమే ఆడనని ప్రకటించిన జోఫ్రా ఆర్చర్‌ కోసం దాదాపుగా రూ.8 కోట్లు వెచ్చించింది. టిమ్‌ డేవిడ్‌ కోసం రూ.8.25 కోట్లు ఇచ్చింది. ఈ డబ్బే మిగతా వాళ్లకు పెట్టుండే ఇంత ప్రాబ్లమ్‌ వచ్చేదే కాదుగా! ఇవన్నీ మించి మైదానంలో ముంబయి డామినేషన్‌ కనిపించడమే లేదు. ఏదేమైనా ఈ ఏడాది ముంబయి ప్లేఆఫ్‌ రేసులోంచి తప్పుకున్నట్టే ఉంది!