ఐపీఎల్‌లో మరో థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. కోల్‌కతాతో చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో లక్నో కేవలం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 210 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంటి బాట పట్టింది.
ఒక్క అవకాశమూ ఇవ్వని ఓపెనర్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లను ఆపడం కోల్‌కతా బౌలర్ల వల్ల కాలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు వచ్చాయి. కానీ ఇలాంటి పార్ట్‌నర్‌షిప్ మాత్రం ఎప్పుడూ చూడలేదు. డికాక్ 70 బంతుల్లోనే 140 పరుగుల కొట్టాడు. ఏకంగా 10 సిక్సర్లు, 10 బౌండరీలు బాదేయడం విశేషం. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. 59 బంతుల్లో 100 పరుగుల మైలురాయి అధిగమించాడు. 19వ ఓవర్లో 3 సిక్సర్లు, 20వ ఓవర్లో 4 బౌండరీలు కొట్టిన తీరు అయితే హైలెట్. అతడికి తోడుగా కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 బౌండరీలు, 4 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు.
ఓపెనింగ్ భాగస్వామ్యంతో పాటు క్వింటన్ డికాక్ మరో రికార్డును సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. క్రిస్ గేల్ (175 నాటౌట్), బ్రెండన్ మెక్‌కలమ్ (158 నాటౌట్) మాత్రమే డికాక్ కన్నా ముందున్నారు. ఏబీ డివిలియర్స్ (133 నాటౌట్), కేఎల్ రాహుల్ (132 నాటౌట్) టాప్-5లో ఉన్నారు. లీగ్ చరిత్రలో ఏ వికెట్‌పై అయినా అత్యధిక మూడో భాగస్వామ్యం రికార్డునూ క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ జోడీ నెలకొల్పింది. 2016లో గుజరాత్ లయన్స్‌పై 229, 2015లో ముంబయిపై 215 పరుగులతో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ నెలకొల్పిన భాగస్వామ్యాల తర్వాత ఇదే అత్యధికం.
రింకూ పోరాడినా...
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత నితీష్ రాణా (42: 22 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (50: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) వేగంగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. మూడో వికెట్‌కు 28 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు.
స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో నితీష్ రాణా అవుటైనా... శామ్ బిల్లింగ్స్‌తో (36: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్‌ను మళ్లీ కుదుటపరిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్ వెంటనే అవుటయ్యాడు. వెంటనే శామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రసెల్ (5: 11 బంతుల్లో) ఇద్దరూ అవుటైనా... రింకూ సింగ్, సునీల్ నరైన్ (21 నాటౌట్: 7 బంతుల్లో, మూడు సిక్సర్లు) పవర్ హిట్టింగ్‌తో కోల్‌కతాలో ఆశలు పెంచారు. ఏడో వికెట్‌కు 19 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. విజయానికి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమైన దశలో ఎవిన్ లూయిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు రింకూ సింగ్ అవుటయ్యాడు. తర్వాతి బంతికి ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ కావడంతో కోల్‌కతా రెండు పరుగులతో ఓటమి పాలైంది.