IPL 2022: KL Rahul and Quinton De Kock made record first wicket partnership of 210 runs against KKR : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు చరిత్రలో ఎన్నడూ చూడని ఓ అద్భుతమైన రికార్డు నమోదైంది. 15 ఏళ్ల చరిత్రలో మొదటి సారి ఒక జట్టు ఓపెనర్లు 20 ఓవర్ల పాటు వికెట్‌ పోకుండా ఆడారు. తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిజంగా ఇది 'నభూతో నభవిష్యతి'! భవిష్యత్తులోనూ ఈ రికార్డు బద్దలు కొట్టడం అంత సులభం కాదు.


ఐపీఎల్‌ 2022లో అత్యంత డిస్ట్రక్టివ్‌ ఓపెనింగ్‌ జోడీ ఎవరిదంటే లక్నో సూపర్‌ జెయింట్స్‌దేనని చెప్పొచ్చు. ఎందుకంటే కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), క్వింటన్‌ డికాక్‌ (Quinton Decock) ఎంత ప్రమాదకరంగా ఆడతారో అందరికీ తెలిసిందే. వీరిద్దరిదీ కుడిఎడమ కాంబినేషన్‌! కేఎల్‌ సమయోచితంగా టైమ్‌ చూసి స్కోరు వేగం పెంచితే డికాక్‌ వచ్చినప్పటి నుంచే దంచికొడతాడు. ఇన్నాళ్లకు, ఈ సీజన్లో ఆఖరి లీగు మ్యాచులో ఈ ఓపెనింగ్‌ జోడీ తమ అసలైన విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.


కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌ జోడీ తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ టార్గెట్‌ను ఇచ్చింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు వచ్చాయి. కానీ ఇలాంటి పాట్నర్‌షిప్‌ మాత్రం ఎప్పుడూ చూడలేదు. అసలింత వరకు చరిత్రలోనే ఓపెనింగ్‌ జోడీ అజేయంగా నిలవలేదు. డికాక్‌ 70 బంతుల్లోనే 140 పరుగుల దంచికొట్టాడు. 10 సిక్సర్లు, 10 బౌండరీలు బాదేశాడు.  36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన అతడు ఆ తర్వాత రెచ్చిపోయాడు. 59 బంతుల్లో 100 పరుగుల మైలురాయి అధిగమించాడు. 19వ ఓవర్లో 3 సిక్సర్లు, 20వ ఓవర్లో 4 బౌండరీలు కొట్టిన తీరు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. అతడికి తోడుగా రాహుల్‌ 51 బంతుల్లో 3 బౌండరీలు, 4 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు.


ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో పాటు క్వింటన్‌ మరో రికార్డును సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. క్రిస్‌గేల్‌ (175 నాటౌట్‌), మెక్‌ కలమ్‌ (158 నాటౌట్‌) అతడి కన్నా ముందున్నారు. ఏబీ డివిలియర్స్‌ (133 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌ (132 నాటౌట్‌) అతడి తర్వాతి స్థానాల్లో నిలిచారు.  ఇక లీగు చరిత్రలో ఏ వికెట్‌పై అయినా అత్యధిక మూడో భాగస్వామ్యం రికార్డునూ డికాక్‌, రాహుల్‌ జోడీ నెలకొల్పింది. 2016లో గుజరాత్‌ లయన్స్‌పై 229, 2015లో ముంబయిపై 215 పరుగులతో విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌ భాగస్వామ్యాల తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.