ఐపీఎల్‌లో శనివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా ఐదో ఓటమి. దీంతో వారు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవడంతో పాటు మిగిలిన జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాలి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 177 పరుగులు సాధించింది. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 123 పరుగులకు పరిమితం అయింది.దీంతో కోల్‌కతా 54 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయి. వారి నెట్ రన్‌రేట్ కూడా భారీగా మెరుగయంది.
సిక్సర్లతో చెలరేగిన కోల్‌కతా బ్యాటర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్న కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 17 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ అజింక్య రహానే (28: 24 బంతుల్లో, మూడు సిక్సర్లు), నితీష్ రాణా (26: 19 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగిపోయారు. వీరి బ్యాటింగ్‌తో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
ఈ జోడి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాక ఉమ్రాన్ మాలిక్ ఇద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి సన్‌రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ తర్వాతి ఓవర్లో శ్రేయస్ అయ్యర్‌ను (15: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ చేశాడు. దీంతో కోల్‌కతా 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రింకూ సింగ్‌ను (5: 6 బంతుల్లో) నటరాజన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.
ఇక్కడ్నుంచి ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), శామ్ బిల్లింగ్స్ (34: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ 63 పరుగులు జోడించారు. భువీ వేసిన 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి శామ్ బిల్లింగ్స్ అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో ఆండ్రీ రసెల్ మూడు సిక్సర్లు కొట్టడంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా... భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, నటరాజన్‌లకు తలో వికెట్ . కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉండగా... సిక్సర్లు మాత్రం 11 ఉండటం విశేషం.
కలిసికట్టుగా విఫలం
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (43: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్‌ల (32: 25 బంతుల్లో, మూడు సిక్సర్లు) తర్వాత అత్యధిక స్కోరు 11 పరుగులంటేనే అర్థం చేసుకోవచ్చు ఇన్నింగ్స్ ఎంత పేలవంగా సాగిందో. కేన్ విలియమ్సన్ (9: 17 బంతుల్లో, ఒక ఫోర్), రాహుల్ త్రిపాఠి (9: 12 బంతుల్లో, ఒక ఫోర్), నికోలస్ పూరన్ (2: 3 బంతుల్లో) ఇలా బ్యాట్స్‌మెన్ అందరూ సమిష్టిగా విఫలం అయ్యారు.
కోల్‌కతా బౌలర్లలో రసెల్ మూడు వికెట్లు తీసుకోగా... టిమ్ సౌతీకి రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్‌లకు తలో వికెట్ దక్కింది.