Key players injuries creating headaches for DC, CSK, SRH, MI: ఐపీఎల్ 15వ సీజన్ సమీపించే కొద్దీ నాలుగు ఫ్రాంచైజీలు ఎక్కువగా పరేషాన్ అవుతున్నాయి! కీలక ఆటగాళ్లు గాయాల పాలవ్వడమే ఇందుకు కారణం. ఆయా జట్లు విజయాలు సాధించాలంటే వారంతా ఫిట్‌నెస్ సాధించడం ముఖ్యం. కానీ వారి పరిస్థితేంటో ఇప్పటి వరకు తెలియడం లేదు. దాంతో వారి ఫిట్‌నెస్ రిపోర్టుల కోసం ముంబయి ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), దిల్లీ క్యాపిటల్స్ (DC), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎదురు చూస్తున్నాయి.
గత సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలు సాధించడంలో దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నార్జ్ (Anrich Nortje) కీలకంగా నిలిచాడు. అతడు 150 కి.మీ. వేగంతో నిలకడగా బంతులు వేశాడు. మరో కరెక్టు పేసర్ గనక అతడికి భాగస్వామిగా ఉంటే ప్రత్యర్థికి ఊపిరి సలపనివ్వడు. హిప్ ఇంజూరీ వల్ల నవంబర్ నుంచి నార్జ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. కోలుకొనేందుకు నాలుగు నెలల సమయం సరిపోతుందని మొదట భావించాడు. కానీ అతడి రికవరీ ఆలస్యమవుతోంది. దాంతో మరొకరిని రిప్లేస్ చేసుకోవాలా లేక ఎదురు చూడాలా అని దిల్లీ సతమతం అవుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇద్దరు ఆటగాళ్లతో ఇబ్బంది ఎదురవుతోంది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పరిస్థితి అర్థం కావడం లేదు. శ్రీలంకతో సిరీసులో అతడి చేతికి గాయమైంది. దాంతో టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. మరో రెండు రోజుల్లో అతడి గాయం తీవ్రత, రికవరీ స్థితిపై రిపోర్టు రానుంది. బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడంలో దీపక్ చాహర్ ప్రతిభాశాలి. రూ.14 కోట్లకు అతడిని చెన్నై సొంతం చేసుకుంది. వెస్టిండీస్ సిరీస్ సమయంలో అతడి క్వాడ్రాసిప్స్‌లో చీలిక రావడంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. సగం సీజన్ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే స్టార్ క్రికెటర్ల కొరత ఎదుర్కొంటోంది. ప్రస్తుత జట్టులో చెప్పుకోగదగ్గ ఆటగాళ్లెవరూ కనిపించడం లేదు. ఉంటే కుర్రాళ్లు. లేదంటే ఎలా ఆడతారో తెలియని విదేశీ క్రికెటర్లు. దానికి తోడు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) స్టేటస్ తెలియడం లేదు. నవంబర్లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు. భుజానికి గాయమవ్వడంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. మొదట్లో చిన్న గాయమే అనుకున్నా తర్వాత ఇతర గాయాలు అయ్యాయి. విలియమ్సన్ ముంబయికైతే వచ్చాడు గానీ మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడో తెలియదు.
ముంబయి ఇండియన్స్ సైతం గాయాల బెడద ఎదుర్కొంటోంది. టీమ్‌ఇండియా మిస్టర్ 360గా భావించే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) గాయపడ్డాడు. అతడి చేతిలో చిన్నపాటి చీలిక వచ్చింది. దాంతో ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడే అవకాశం లేదు. అయితే రెండో మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడని తెలియడం ఆనందాన్ని ఇచ్చేదే.