ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తను ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్కును దాటాడు. ఐపీఎల్‌లో అత్యంత తక్కువ బంతుల్లో ఈ మార్కును అందుకున్న ఆటగాడిగా రసెల్ నిలిచాడు.
ఆండ్రీ రసెల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 96 మ్యాచ్‌లు ఆడాడు. 1129 బంతుల్లో 2,037 పరుగులను సాధించాడు. తన బ్యాటింగ్ యావరేజ్ 31.33 కాగా... స్ట్రైక్ రేట్ 180.42గా ఉంది. ఆండ్రీ రసెల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఆటగాడు.
దీంతోపాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రెండు వేల పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రసెల్ నిలిచాడు. తన కంటే ముందు గౌతం గంభీర్ (3,345 పరుగులు), రాబిన్ ఊతప్ప (2,649 పరుగులు), యూసుఫ్ పఠాన్ (2.061 పరుగులు) ఈ మార్కును దాటారు.
ఒక ఐపీఎల్ సీజన్‌లో 250కు పైగా పరుగులు చేయడంతో పాటు, 10కి పైగా వికెట్లు తీసిన ఫీట్‌ను ఎక్కువ సార్లు సాధించిన ఆటగాడిగా కూడా ఆండ్రీ రసెల్ నిలిచాడు. ఈ ఫీట్‌ను రసెల్ ఏకంగా నాలుగు సార్లు అందుకున్నాడు. జాక్వెస్ కలిస్ మూడు సార్లు ఈ ఫీట్ సాధించగా... కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, షేన్ వాట్సన్ తలో రెండు సార్లు ఈ రికార్డు అందుకున్నారు.