IPL 2022 News: ఐపీఎల్‌ 2022లో విరాట్‌ కోహ్లీ కనీసం 600 పరుగులు చేస్తాడని మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అంటున్నాడు. కెప్టెన్సీ భారం లేకపోవడంతో అతడు ఫ్రీ అయ్యాడని పేర్కొన్నాడు. డుప్లెసిస్‌కు ఎంతో అనుభవం ఉందని వెల్లడించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచుకు ముందు అతడు ఓ యూట్యూబ్‌ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు.


ఐపీఎల్‌ 2022లో ఆర్‌సీబీ ఈ సారి కొత్తగా బరిలోకి దిగింది. తొలిసారి విరాట్‌ కెప్టెన్సీ చేయడం లేదు. డుప్లెసిస్‌ రూపంలో కొత్త కెప్టెన్‌ వచ్చాడు. మిస్టర్‌ 360 డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఆడటం లేదు. అయినప్పటికీ ఆర్‌సీబీ జోష్‌లోనే కనిపిస్తోంది. తన సోదరుడు, మిత్రుడు కోహ్లీ ఈసారి భారీగా పరుగులు చేయాలని ఏబీ కోరుకుంటున్నాడు.


'డుప్లెసిస్‌ కెప్టెన్‌గా వచ్చాడని అందరికీ తెలుసు. విరాట్‌ మొదటి సారి ఒక బ్యాటర్‌గా బరిలోకి దిగుతుండటం నన్ను ఎక్సైట్‌ చేస్తోంది. ఎందుకంటే అతడిపై ఒత్తిడి తగ్గుతుంది. స్వేచ్ఛగా మైదానంలోకి వెళ్లి పరుగులు చేయగలడు. ఇది విరాట్‌కు పెద్ద సీజన్‌ అవుతుందనుకుంటున్నా. కనీసం 600+ పరుగులు చేస్తాడని అంచనా వేస్తున్నాను. డుప్లెసిస్‌కు అవసరమైన ప్రతిసారీ కోహ్లీ అండగా ఉంటాడని తెలుసు. కానీ డుప్లెసిస్‌కు ఎంతో అనుభవం ఉంది. ఎంతో శిక్షణ పొందాడు. అతడు కోహ్లీతో పాటు యువకులు స్వేచ్ఛగా ఆడేలా చేస్తాడు. ఈ ఏడాది ఆర్‌సీబీ నుంచి కొందరు కుర్రాళ్లు ఎదుగుతారని అంచనా వేస్తున్నా' అని ఏబీడీ అంటున్నాడు.


RCB బ్యాటింగ్‌ అదుర్స్‌.. బౌలింగ్‌ బెదుర్స్‌


తొలి మ్యాచులో ఓటమి పాలైనప్పటికీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) బ్యాటింగ్‌ మాత్రం అందరినీ ఉర్రూతలూగించింది. మొదట్లో ఆచితూచి ఆడిన ఆర్‌సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్ (Faf du plessis) ఐదో ఓవర్‌ తర్వాత స్టేడియం చుట్టూ సిక్సర్లు, బౌండరీల వరద పారించాడు. అతడికి తోడుగా విరాట్‌ కోహ్లీ (Virat Kohli) బాదిన సిక్సర్లు ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాయి. ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik) సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. టాప్‌ టు మిడిలార్డర్‌ అంతా ఫామ్‌లో ఉండటం ఆర్‌సీబీకి హ్యాపీ. మాక్సీ (maxwell) వచ్చేశాడంటే ఇక తిరుగుండదు. మంచి బౌలర్లే ఉన్నప్పటికీ డ్యూ ఫ్యాక్టర్‌ వారికి చేటు చేసింది. సిరాజ్‌ (Mohammed Siraj) 4 ఓవర్లలో 59 పరుగులిచ్చి 2 వికెట్లే తీశాడు. ఆకాశ్‌ దీప్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ (Harshal Patel) ఎకానమీ మరీ ఎక్కువగా ఉంది. వీరంతా టైట్‌ లైన్స్‌లో బౌలింగ్‌ చేస్తే గెలుపు బాట పట్టొచ్చు.