IPL 2024: ఐపీఎల్‌.. మూడు అక్షరాల పదం క్రికెట్ అనే ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది. అలాంటి మహా టోర్నీకి ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉంది. ఈ టైంలో రెండు నెంబర్‌పై ఉన్న రికార్డ్స్‌పై ఓ లుక్‌ వేద్దాం... 


రోహిట్ కెప్టెన్సీ
 ఐపీయ‌ల్‌లో ఎక్కువ మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ చేసిన ఆట‌గాడిగా రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ‌(Rohit Sharma).మొత్తం 158 మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ చేసిన హిట్‌మ్యాన్ 87 విజ‌యాల‌ను టీంకు అందించి ఎక్కువ మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ చేసిన రెండో ఆట‌గాడయ్యాడు. ఐపీయ‌ల్(IPL) లో ముంబై టీంకు 2013,2015,2017,2019,2020ల్లో టైటిళ్లు అందించాడు.ఈ టోర్నీలో రెండో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ అయ్యాడు. ప్ర‌స్తుతం ముంబై జ‌ట్టు హార్ధిక్‌పాండ్యాని(Hardik Pandya) టీం కెప్టెన్ గా నియ‌మించ‌డంతో రోహిత్ ఐపీయ‌ల్ కెప్టెన్ గా ఈ రికార్డ్‌తోనే స‌రిపెట్టుకోనున్నాడు.


మెక్‌క‌ల్లోలం
 ఐపీయ‌ల్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ విభాగంలో బ్రెండ‌న్ మెక్ క‌ల్లమ్(Brendon McCullum) రెండ‌వ స్థానంలో ఉన్నాడు. ఐపీయ‌ల్ మొట్ట‌మొద‌టి మ్యాచ్ లోనే  బ్రెండ‌న్ మెక్ క‌ల్లమ్  ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్  ఐపీయ‌ల్ ఉన్నంత‌కాలం గుర్తుంటుంది. 2018 ఏప్రిల్ 18 న రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగ‌ళూర్(Royal Challengers Bengaluru ) తో జ‌రిగిన మ్యాచ్ లో క‌ల్లోలం సృష్టించాడు మెక్‌క‌ల్లం. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) త‌ర‌ఫున బ‌రిలో దిగిన మెక్ క‌ల్లం కేవ‌లం 73 బంతుల్లోనే 158 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 13 సిక్స్ లు, 10 ఫోర్లు ఉన్నాయి. స్ర్టైక్‌రేట్ 216కు పైగా ఉంది. భ‌విష్య‌త్తు ఐపీయ‌ల్ ఎలా ఉంటుందో చెప్పింది ఈ ఇన్నింగ్స్ .


డీజే మోత‌
 ఐపీయ‌ల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక వికెట్లుతీసిన వారిలో రెండ‌వ స్థానంలో కొన‌సాగుతున్నాడు డిజే బ్రావో(Dwayne Bravo). 2022లోనే లీగ్ కి టాటా చెప్పేసిన ఈ ఆల్‌రౌండ‌ర్ టోర్నీలో 183 వికెట్ల‌తో నంబ‌ర్‌టూ గా కొన‌సాగుతున్నాడు. జ‌ట్టుకి వికెట్ కావాల్సిన‌ప్పుడు కెప్టెన్ చూసే బౌల‌ర్ ఎవ‌ర‌య్యా అంటే బ్రావోనే అని త‌న గ‌ణాంకాలు చెప్తున్నాయి. 158 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు బ్రావో.


గేల్ సునామీ
విధ్వంస‌క వీరుడు క్రిస్ గేల్(Chris Gayle) ఐపీయ‌ల్ కెరియ‌ర్లో 6 సెంచ‌రీలు బాదేసి 2వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 148 స్ర్టైక్‌రేట్‌తో ఆడిన గేల్ మ‌రో 31 అర్ధ‌శ‌త‌కాల‌ను త‌న పేరిట లిఖించికున్నాడు. 2009 నుంచి 2021 వ‌ర‌కు ఐపీయ‌ల్ ఆడిన గేల్ ఆర్సీబీ త‌ర‌ఫున ఎక్కువ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గేల్ సెంచ‌రీ చేసిన త‌ర్వాత చేసే సెల‌బ్రేష‌న్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న క‌రేబియ‌న్ స్టైల్లో చేసే సెల‌బ్రేష‌న్స్ త‌న రికార్డుల‌కు కొత్త అందాన్నిస్తాయి.


హిట్‌మ్యాన్ రికార్డ్‌
ఐపీయ‌ల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడి జాబితాలో రెండో స్థానంలోఉన్నాడు ముంబై బ్యాట‌ర్ రోహిత్‌శ‌ర్మ‌. ఐపీయ‌ల్ చ‌రిత్ర‌లో మొత్తం 243 మ్యాచ్ లు ఆడి ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. డెక్క‌న్ ఛార్జ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్ టీముల్లో ఆడిన ఈ టీమిండియా కెప్టెన్‌.... మొత్తం 6211 ప‌రుగులు సాధించాడు. ఇందులో 109 ప‌రుగుల అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త స్కోరు కూడా ఉంది. 2008లోనే త‌న ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన హిట్‌మ్యాన్.. ప్ర‌స్తుతం రెండోస్థానంలో  కొన‌సాగుతున్నాడు.


ల‌క్నో ఊచ‌కోత‌
ఐపీయ‌ల్ లో అత్య‌ధిక టీం స్కోర్ విభాగంలో రెండో స్థానంలో ఉంది... ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌(Lucknow Super Giants). 2023 ఏప్రిల్ 28న మొహాలీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో ఈ ఘ‌న‌త సాధించింది. ఇర‌వై ఓవ‌ర్ల‌లో 12.85 ర‌న్ రేట్ తో 5 వికెట్లు కోల్పోయి 257 ప‌రుగులు సాధించింది ల‌క్నో. మొహాలీలో పంజాబ్ కింగ్స్‌(Punjab King)తో జ‌రిగిన మ్యాచ్ లో ల‌క్నో ఈ ఘ‌న‌త సాధించింది. లక్నో బ్యాట‌ర్ల ధాటికి పంజాబ్ ఫీల్డ‌ర్లు మైదానంలో క‌న్నా బౌండ‌రీ దాటిన బంతుల‌ను తెచ్చేందుకే ఎక్కువ క‌న‌బ‌డ్డారని కామెంటేట‌ర్ అన్నారు అంటే ప‌రిస్థితి అర్ధం అవుతుంది. 


 లెజెండ్ లివింగ్
క్రీజులోకి రావ‌డంతోనే బాదుడు ప‌నిగా పెట్టుకొనే లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone) బౌల‌ర్ ఎవ‌ర‌న్న‌ది కూడా ఆలోచించ‌డు. బంతి బౌండ‌రీ దాటిందా లేదా అనేది మాత్ర‌మే చూసుకొంటాడు. 165.60  స్ర్టైక్‌రేట్ తో ఐపీయ‌ల్ లో ఎక్కువ  స్ర్టైక్‌రేట్ క‌లిగిఉన్న ఆట‌గాళ్ల‌లో 2వ‌ స్థానంలో నిలిచాడు లివింగ్‌స్టోన్‌. 2019 నుంచి మాత్ర‌మే ఐపీయ‌ల్ కి అందుబాటులో ఉన్న ఈ ఆట‌గాడు కేవ‌లం 32 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఈ సారి త‌నస్ర్టైక్‌రేట్  ని మ‌రింత పెంచాల‌ని నెట్స్ లో చెమ‌టోడుస్తున్నాడు.


 ఆ రెండు ప‌రుగులు
ఐపీయ‌ల్లో క్రికెట్ అభిమానుల హార్ట్‌బీట్ పెంచేస్తుంటాయి కొన్ని మ్యాచ్‌లు. ప్ర‌తీ వికెట్ కీల‌కం అన్న‌ట్లు కేవ‌లం 2 వికెట్ల‌తో మ్యాచ్‌గెలిచిన సంద‌ర్భం ఒక‌టుంది. అదే గ‌త సీజ‌న్ 2023లో ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ , పంజాబ్ కింగ్స్ ల‌ మ‌ధ్య మ్యాచ్‌ 2023 ఏప్రిల్ 15న ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ మీద‌ 2 వికెట్ల‌తో గెలుపొందింది. అప్ప‌టివ‌ర‌కు వికెట్ల వేట కొన‌సాగించిన ల‌క్నో బౌల‌ర్లు పంజాబ్ చివ‌రి రెండు వికెట్లు తీయ‌లేకపోయారు. 


దినేశ్ కీపింగ్ కార్తిక్‌
ఐపీయ‌ల్ లో వికెట్‌కీప‌ర్ గా అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన కీప‌ర్ జాబితా లో రెండో స్థానంలో ఉన్నాడు... దినేశ్‌కార్తీక్‌(Dinesh Karthik).  2008 నుంచి ఐపీయ‌ల్ లో కొన‌సాగుతున్న‌కార్తీక్  169 బ్యాట‌ర్ల‌ను అవుట్ చేశాడు. ఇందులో 133 క్యాచ్‌లు, 36 స్టంపింగ్స్ చేసి నంబ‌ర్ టూ స్థానంలో కొన‌సాగుతున్నాడు.  224 ఇన్నింగ్స్ ల్లో కార్తీక్ ఈ ఘ‌న‌త సాధించాడు. 6 టీమ్ ల త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించిన కార్తీక్ వికెట్‌కీపింగ్ తో జ‌ట్టుకి విజ‌యాలు అందించాడు.


నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌
 ఇక ముంబ‌య్ కి వ‌రుస టైటిళ్లు అందించిన  రోహిత శ‌ర్మ త‌న ఐపీయ‌ల్ లోఎక్కువ సార్లు డ‌కౌట్ అయ్యిన రెండో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. 238 ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్ 16 సార్లు ఇలా ఖాతా తెర‌వ‌కుండానే వికెట్ స‌మ‌ర్పించుకొన్నాడు. ఓపెన‌ర్ గా వ‌చ్చి ఇలా ప‌రుగులేమీ చేయ‌కుండానే వెనుదిరిగితే ఆ భారం జ‌ట్టు మీద ప‌డుతుంది. రోహిత్ ముందునుంచే హిట్టింగ్ మీద దృష్ఠిపెట్ట‌డం వ‌ల‌న ఇలా వికెట్ చేజార్చుకొంటాడు అని విశ్లేష‌కులు అంటున్నారు.