Im different from Rahul Dravid or MS Dhoni or anyone else says Sanju Samson : కెప్టెన్సీ అందుకున్న ఏడాదిలోనే సంజు శాంసన్‌ (Sanju Samson) అద్భుతం చేశాడు! ఐపీఎల్‌ 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌ను రన్నరప్‌గా నిలిపాడు. తన నాయకత్వ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. జట్టును నడిపించేందుకు తానెవరినీ అనుకరించలేదని అతడు స్పష్టం చేశాడు. తానేమీ ఎంఎస్‌ ధోనీ, రాహుల్‌ ద్రవిడ్‌ను కాదని వెల్లడించాడు.


గతేడాది ఐపీఎల్‌లో స్టీవ్‌స్మిత్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఎన్నాళ్లుగానో తమకే సేవలు అందిస్తున్న సంజు శాంసన్‌కు పగ్గాలు అప్పగించింది. ఆ సీజన్‌ను ఎలాగోలా ముగించిన రాయల్స్‌ ఈసారి మాత్రం తనదైన రీతిలో రెచ్చిపోయింది. ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. పెద్ద పెద్ద ఇన్నింగ్సులు ఆడనప్పటికీ సంజూ 17 మ్యాచుల్లో 147 స్ట్రైక్‌రేట్‌తో 458 పరుగులు చేశాడు. చాలాసార్లు మెరుపు ఇన్నింగ్సులతో అలరించాడు. మైదానంలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ తనలోని నాయకుడిని బయటపెట్టాడు.


'నేనేమీ రాహుల్‌ ద్రవిడ్‌, ధోనీ, ఇంకెవెర్నో కాదు! అందుకే నాలాగే సహజ ధోరణిలో ఉంటాను. ముందు నేను జట్టు మూడ్‌ ఎలా ఉందో తెలుసుకుంటాను. చాలాసార్లు ఆటగాళ్లంతా ప్రేరణతో ఉంటారు. అలాంటప్పుడు మీరు అత్యుత్తమ ప్రతిభను బయటపెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ అద్భుతంగా ఆడాలని ప్రయత్నిస్తుంటే నేను మళ్లీ చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది' అని సంజు అంటున్నాడు.


భారత్‌-ఏకు ఆడుతున్నప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌తో సన్నిహితంగా పనిచేశానని శాంసన్‌ తెలిపాడు. ఆటగాళ్లు అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టేందుకు ద్రవిడ్‌ ప్రేరణ కల్పిస్తాడని పేర్కొన్నాడు. 'ఆయన మాటలు అద్భుతంగా ఉంటాయి. మనిషి అత్యున్నత జీవిత లక్ష్యం గురించి ఆయన తరచూ చెబుతుంటారు. ఆయన మాటలకు ఎంతో శక్తి ఉంటుంది. సుదీర్ఘకాలం అవి మనపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాకుండా ఆయన మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అర్థం చేసుకుంటారు. ప్రేమిస్తారు. బాగా ఆడేలా స్ఫూర్తినిస్తారు. రాజస్థాన్‌ రాయల్స్‌లోనూ అలాంటి వాతావరణం సృష్టించేందుకు మేం ప్రయత్నిస్తుంటాం' అని శాంసన్‌ వెల్లడించాడు.