Sandeep Sharma: ముంబై(MI)తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లతో చెలరేగిన  రాజస్థాన్ రాయల్స్(RR) పేసర్ సందీప్ శర్మ చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ తరఫున ఐదు వికెట్ల హాల్ సాధించిన భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ తరఫున ఐదుగురు బౌలర్లు ఐదు వికెట్ల హాల్ సాధించగా.. అందులో యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ మాత్రమే భారత క్రికెటర్లు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారత పేసర్‌గా కొనసాగుతున్న సందీప్ శర్మ.. 119 మ్యాచ్‌ల్లో 130 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ సందీప్‌ శర్మ నిలిచాడు. 
సందీప్ శర్మ 2018 నుంచి 2021 వరకు నాలుగు సీజన్లపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2018లో సందీప్ శర్మను రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. 2021 సీజన్ తర్వాత రిలీజ్ చేసింది. 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన సందీప్ శర్మ.. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన మినీ వేలంలో అమ్ముడుపోలేదు. దీనిపై తొలిసారిగా సందీప్‌ శర్మ స్పందించాడు. రెండేళ్ల క్రితం వేలంలో తనను ఎవరూ తీసుకోలేదని కానీ ప్రస్తుతం తాను ఆటను ఆస్వాదిస్తున్నట్లు సందీప్‌ తెలిపాడు. వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయి.. రీప్లేస్‌మెంట్‌గా అవకాశం దక్కించుకున్న తనకు ఆడే ప్రతి మ్యాచ్ బోనసేనని సందీప్ తెలిపాడు.


అవకాశాన్ని ఒడిసిపట్టి...
రాజస్థాన్‌ పేసర్‌ ప్రసిద్ధ్ కృష్ణ గాయపడటంతో రాజస్థాన్ రాయల్స్ అతడి స్థానంలో రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు సందీప్ శర్మను  తీసుకుంది. ఈ సీజన్‌లోనూ లక్నో, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఆడిన సందీప్ శర్మ..గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించిన సందీప్‌ శర్మ... ముంబైతో మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలన్న సందీప్ శర్మ.. ధైర్యంతోపాటు ప్రణాళికలను అమలు చేయాలన్నాడు.  



సందీప్ శర్మ డెత్ బౌలింగ్ లో ధోని లాంటోడు. సందీప్ శర్మ కొన్నేళ్లుగా ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. రెండేళ్లుగా రాజస్థాన్ కు అయితే మర్చిపోలేని విక్టరీలను తన డెత్ బౌలింగ్ తో అందించాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించటంలో జైశ్వాల్ సెంచరీ ఎంత విలువైనదో అంతకంటే విలువైనది సందీప్ శర్మ బౌలింగ్. 4 ఓవర్లలో కేవలం 18పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు సాధించాడీ ఈ సీనియర్ పేసర్. ఇన్నింగ్స్ ప్రారంభంలో ముంబై కి కీలక బ్యాటర్లైన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లను అవుట్ చేసి ఆ టీమ్ ని కష్టాల్లోకి నెట్టేసిన సందీప్... ఇన్నింగ్స్ చివరి తన డెత్ బౌలింగ్ తో ముంబైను కుప్పకూల్చాడు. తిలక్ వర్మ జోరుగా ఆడుతుండటంతో ఈజీగా 200వరకూ వెళ్లిపోతునందుకున్న ముంబై స్కోరుకు కళ్లెం వేశాడు సందీప్. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కొయెట్జీలను పెవిలియన్ కు పంపించి ముంబై 179పరుగులకే పరిమితమయ్యేలా చేశాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను అందుకున్నాడు. చివరి ఓవర్లో టెన్షన్ పడకుండా గతంలో ఎన్నో విజయాలు అందించిన సందీప్..మళ్లీ అదే కూల్ నెస్ తో మాహీని గుర్తు చేస్తూ రాజస్థాన్ కు మరోసీజన్ లో అండగా నిలుస్తున్నాడు.