IPL 2024: భారత్‌లో జరిగిన ప్రపంచకప్ నుంచి గాయం కారణంగా అర్ధాంతరంగా వైదొలిగిన టీమిండియా టీ 20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్‌లో తిరిగి ముంబై గూటికి చేరనున్నాడా.? రోహిత్ శర్మ సారథ్యంలో ఈ మెగా లీగ్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండర్ బరిలోకి దిగనున్నాడా, ముంబైలో చేరేందుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యా వైదొలిగేందుకు సిద్ధమయ్యాడా, IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్‌కు రంగం సిద్ధమవుతోందా, తొలి సీజన్‌లో తమకు ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్ అంగీకరించిందా, వీటన్నింటికీ అవుననే సమాధానాలే వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ముంబై పావులు కదుపుతోంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో ఒక్క రోజులో ముగుస్తుందనగా హార్దిక్ పాండ్యా మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్ 17వ ఎడిషన్ బదిలీలలో ఇప్పుడు హార్దిక్ పాండ్యా అంశమే తీవ్ర చర్చకు తావిస్తోంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడేందుకు అంగీకరించినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ట్రేడ్ రూపంలో అతన్ని తమ జట్టులోకి తెచ్చేందుకు నీతా అంబానీకి చెందిన ముంబై యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. పాండ్యాను జట్టులోకి తీసుకొచ్చి అతడికి బదులు జోఫ్రా ఆర్చర్‌ని ట్రేడ్ రూపంలో వదులుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ డీల్ ఓకే అయినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే IPL 2024 ప్రారంభమయ్యే నాటికి పాండ్యా ముంబై ఇండియన్స్ గూటికి చేరతాడు. అయితే అటు గుజరాత్ టైటాన్స్ గానీ.. ముంబయి ఇండియన్స్ గానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆటగాళ్లను మార్చుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఆదివారం వరకు గడువుంది. అప్పటివరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేనట్లే. పాండ్య ఏడేళ్లు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు.
2022 IPL సీజన్‌కు ముందు సీజన్ ముందు ముంబయి వదులుకోగా.. అతడిని సొంతం చేసుకున్న గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. హార్దిక్ సారథ్యంలో వరుసగా రెండేళ్లు గుజరాత్ ఫైనల్ చేరింది. తొలి ఏడాది టైటిల్ గెలిచిన ఆ జట్టు.. ఈ ఏడాది చెన్నై చేతిలో పరాజయంపాలైంది. 2022 ఐపీఎల్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ పాండ్యా కోసం రూ.15 కోట్లు వెచ్చించగా.. జోఫ్రా ఆర్చర్ కోసం ముంబై యాజమాన్యం రూ.8 కోట్లు వెచ్చించింది. ఇంత భారీ ధర పలికిన ఆటగాళ్లు ట్రేడ్ ద్వారా బదిలీ కావడమనేది క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ డీల్ ఒకే అయితే ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్ కానుంది. హార్దిక్ ముంబయికి తిరిగొస్తే.. అతడు రోహిత్ సారథ్యంలో ఆడతాడా.. లేదంటే అతడే కెప్టెన్‌గా ఉంటాడా అన్నది ఆసక్తికరమే. హార్దిక్ ఒకవేళ ముంబైకు వెళ్తే గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశముంది.
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే పురుషుల ఐపీఎల్ నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసిన బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLపైనా దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ముంబయి వేదికగా డిసెంబర్ 9న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈసారి బెంగళూరు, ముంబై వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను కూడా పెంచి బీసీసీఐ శుభవార్త చెప్పింది. గతేడాది రూ. 12 కోట్లుగా ఉన్న ఒక్కో ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను ఈ ఏడాది రూ. 13.5 కోట్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.5 కోట్లు అధికం.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply