IPL 2025 SRH 4th Consecutive Loss: సన్ రైజర్స్ హైదరాబాద్ కు లక్కు కలిసి రాలేదు. వరుసగా నాలుగో మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో పరాజయం పాలైంది. దీంతో హ్యాట్రిక్ విజయాలతో టైటాన్స్.. పాయింట్ల పట్టికలో టాప్-2 లోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 31, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/17) ఐపీఎల్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ తో సత్తా చాటాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (43 బంతుల్లో 61 నాటౌట్, 9 ఫోర్లు)తో సత్తా చాటాడు. కీలకదశలో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ను ఆడాడు. బౌలర్లలో మహ్మద్ షమీ (2/28)తో సత్తా చాటాడు. సిరాజ్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
చాలెంజింగ్ స్కోర్..సన్ రైజర్స్ బలానికి విరుద్ధంగా స్లో వికెట్ ను ఈ మ్యాచ్ కు సిద్ధం చేశారు. ఈ క్రమంలో పరుగులు చేయడానికి బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18), ఇషాన్ కిషన్ (17) వికెట్లను కోల్పోవడంతో ఓ దశలో 50/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (27) తో కలిసి నితీశ్ కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో అనికేత్ వర్మ (18), పాట్ కమిన్స్ (22 నాటౌట్) తో వేగంగా ఆడటంతో సన్ రైజర్స్ సవాలు విసరగలిగే స్కోరు సాధించింది. బౌలర్లలో ప్రసిధ్ , సాయి కిశోర్ కు రెండేసి వికెట్లు దక్కాయి.
వాషింగ్టన్ విధ్వంసం.. చిన్న టార్గెట్ ను కాపాడుకోడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ మెరుగ్గానే ఆరంభించింది. ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ డకౌట్ లతో త్వరగానే పెవిలియన్ కు పంపింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సిమర్జిత్ సింగ్ బౌలింగ్ లో 20 పరగులు సాధించడంతో గుజరాత్ ముమెంటంను సాధించింది. మరో ఎండ్ లో గిల్ కూడా అతనికి సహకారం అందించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 90 పరుగులు జోడించారు. చివర్లో ఫిఫ్టీకి ఒక్క పరుగు దూరంలో సుందర్ ఔటయ్యాడు. ఆ తర్వాత షర్ఫేన్ రూథర్ ఫర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్) ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అతని తో కలిసి గుజరాత్ ను మరో 20 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు గిల్ చేర్చాడు.