GT 1st Win in IPL 2025: సొంతగడ్డపై అన్ని రంగాల్లో రాణించిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో తొలి విజయాన్ని సాధించింది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 36 పరుగులతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (63) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన ముంబై 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసింది. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48, 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి.
మరోసారి మెరిసిన సుదర్శన్..సీజన్ తొలి మ్యాచ్ లో ఫిఫ్టీతో రాణించిన ఓపెనర్ సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్ లోనూ సూపర్ టచ్ లో కనిపించాడు. ఆరంభం నుంచే షాట్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఇక మరో ఓపెనర్ శుభమన్ గిల్ (38) చక్కగా రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. ఆ తర్వాత గిల్ ఔటైనా తన జోరు ఏమాత్రం తగ్గించకుండా 33 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (39)కు సత్తా చాటడంతో ఒక దశలో 129-1తో గుజరాత్ భారీ స్కోరుపై కన్నేసింది. అయితే ఈ దశలో బౌలర్లు పుంజుకోవడంతో గుజరాత్ అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్లు కూడా విఫలం కావడంతో గుజరాత్ 200 పరుగుల మార్కును సాధించలేక పోయింది. తెలుగు పేసర్ సత్యనారాయణ రాజు ఐపీఎల్లో తొలి వికెట్ సాధించాడు.
ఛేదనలో వెనుకబడిన ముంబై.. ఇక భారీ టార్గెట్ ను ఛేదించడంలో ముంబై కి శుభారంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (8), ర్యాన్ రికెల్టన్ (6) త్వరగా ఔటయ్యారు. వీరిద్దరి వికెట్లను హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తీశాడు. ఈ దశలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ (39)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు సూర్య కుమార్ ప్రయత్నించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట కాస్త వేగంగా ఆడారు. అయితే తిలక్ వెనుదిరిగాక ముంబై ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత సూర్య పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్ హార్దిక్ (11) సహా మిడిలార్డర్ విఫలం కావడంతో ముంబై కోలుకోలేక పోయింది. ఆఖర్లో సూర్య కూడా వెనుదిరగడంతో పోరాటం ముగిసినట్లయ్యింది. దీంతో గుజరాత్ ధాటికి తలొంచి, పరాజయం పాలైంది. మిగతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో గుజరాత్ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసి బోణీ కొట్టింది.