GT vs RCB IPL 2024 Preview and Prediction : ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్నా పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలన్న తప్పక గెలుపు అవసరమైన వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో గుజరాత్ జెయింట్స్(GT) తలపడనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమైన బెంగళూరు... హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి కాస్త ఆత్మ విశ్వాసంతో ఉంది. బలహీనంగా ఉన్న గుజరాత్ బౌలింగ్ దళం... బలంగా కనిపిస్తున్న బెంగళూరు బ్యాటర్లకు మధ్య పోరు జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో ఉత్కంఠభరిత పోరు తప్పదని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇరు జట్లదీ అదే సమస్య
గుజరాత్, బెంగళూరు జట్లను బలహీనమైన బౌలింగ్ వేధిస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు రాణించినా ఈ సీజన్‌లోని గత మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉన్న వేళ... బలహీనమైన బౌలింగ్ ఎవరికి శాపంగా మారనుందో చూడాలి. గుజరాత్ ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు అయిదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కూడా ఎనిమిది పాయింట్లే ఉన్నా నెట్ రన్‌రెట్‌తో గుజరాత్‌కంటే పైన ఉన్నాయి. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని శుభ్‌మన్ గిల్ సేన భావిస్తోంది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 10.35, ఉమేష్ యాదవ్10.55, సందీప్ వారియర్ 10.85 సగటుతో పరుగులు ధారళంగా ఇవ్వడం గుజరాత్‌ను ఆందోళన పరుస్తోంది. స్పెన్సర్ జాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రాణిస్తున్నా అది సరిపోవడం లేదు. గుజరాత్ జట్టులో స్పిన్నర్లు రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.
బెంగళూరు బ్యాటింగ్ గాడిన పడినట్లేనా..
ఈ ఐపీఎల్ సీజన్‌లో బెంగళూరు బౌలర్లు విఫలమైనా బ్యాటర్లు రాణించారు. గత మ్యాచ్‌లో రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్‌లు ఫామ్‌ను అందుకుని పరుగులు సాధిస్తుండడం బెంగళూరుకు ఉత్సాహాన్నిస్తోంది. రజత్ పాటిదార్ చివరి రెండు మ్యాచ్‌ల్లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే వంటి బౌలర్లను ఎదుర్కొని అర్ధశతకాలు చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పాటిదార్ 23 బంతుల్లో 52 పరుగులు చేయగా... హైదరాబాద్‌పై 20 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. గుజరాత్ స్పిన్నర్‌లపై కూడా పాటిదార్ రాణిస్తాడని బెంగళూరు భావిస్తోంది. సన్‌రైజర్స్‌పై 20 బంతుల్లో 37 పరుగులు చేసి RCBని 200 పరుగుల మార్కును అధిగమించేలా చేసిన గ్రీన్ కూడా టచ్‌లోకి వచ్చాడు. విరాట్ కోహ్లి, డు ప్లెసిస్‌లు భారీ స్కోర్లపై కన్నేయగా.. దినేష్ కార్తీక్, లామ్రోర్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. వీరు మరోసారి రాణిస్తే బెంగళూరు విజయం సాధించడం కష్టమేమీ కాదు.
జట్లు
బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
గుజరాత్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, B. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్, BR శరత్.