Fastest to Reach 8000 Runs in T20: ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. తన T20 కెరీర్‌లో 8000 పరుగులు పూర్తి చేయడానికి 33 పరుగులు మాత్రమే కావాలి. ఈ మార్క్ చేరుకుంటే విరాట్ కోహ్లీ రికార్డును రాహుల్ బద్దలు కొడతాడు. రాహుల్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగే కీలకమైన మ్యాచ్‌లో అతను మంచి ఇన్నింగ్స్ ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్2లలో 6 మ్యాచ్‌లు గెలిచింది, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. 13 పాయింట్లతో జట్టు ఐదో స్థానంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్ తర్వాత రి రెండు మ్యాచ్‌లు గెలవాలి, కానీ ఒక మ్యాచ్ ఓడినా ఢిల్లీ ప్లేఆఫ్స్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. కెఎల్ రాహుల్ పెద్ద రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.
T20 క్రికెట్‌లో అతివేగంగా 8000 పరుగులు
విరాట్ కోహ్లీ ప్రస్తుతం T20 క్రికెట్‌లో అతివేగంగా 8000 పరుగులు చేసిన భారత బ్యాటర్. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాడు. కానీ కెఎల్ రాహుల్ ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ 257 మ్యాచ్‌లలో 243వ ఇన్నింగ్స్‌లో T20 కెరీర్‌లో 8000 పరుగులు పూర్తి చేశాడు. రాహుల్‌కు నేటి మ్యాచ్ 237వ మ్యాచ్, 224వ ఇన్నింగ్స్ మాత్రమే. మరో 33 పరుగులు చేస్తే టీ20 కెరీర్ లో 8000 పరుగుల మార్క్ చేరుకుంటాడు. రాహుల్ ప్రస్తుతం 7967 పరుగులతో ఉన్నాడు. ఇందులో 6 శతకాలు, 68 అర్ధశతకాలు ఉన్నాయి.
ఈ జాబితాలో అగ్రస్థానంలో వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఉన్నాడు. యూనివర్సల్ బాస్ గేల్ 217 మ్యాచ్‌లు, 213 ఇన్నింగ్స్‌లలో టీ20ల్లో 8వేల మార్కును చేరుకున్నాడు. రెండో స్థానంలో బాబర్ ఆజం ఉన్నాడు పాక్ బ్యాటర్ 227 మ్యాచ్‌లు, 218 ఇన్నింగ్స్‌లలో 8000 T20 పరుగులు చేశాడు.
IPL 2025లో కెఎల్ రాహుల్ ప్రదర్శన
హాస్పిటల్ లో ప్రెగ్నెన్సీతో ఉన్న భార్య డెలివరీకి సిద్ధంగా ఉండటంతో మొదటి మ్యాచ్‌ను మిస్ అయిన కెఎల్ రాహుల్ ఈ సీజన్‌లో మిగతా 10 మ్యాచ్‌లలో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధశతకాలు ఉన్నాయి. రాహుల్ 30 బౌండరీలు, 16 సిక్స్‌లు కొట్టాడు. రాహుల్ అతిపెద్ద ఇన్నింగ్స్ RCBతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఏప్రిల్ 10న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 93 పరుగులు చేశాడు. చెన్నై, లక్నోతో జరిగిన మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేశాడు.