Faf Du Plessis Stats: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కేవలం 39 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. వాస్తవానికి టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కష్టాల నుంచి గట్టెక్కించాడు.
ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ఫామ్
అదే సమయంలో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ 400 పరుగుల మార్కును అధిగమించాడు. ఈ సీజన్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ ఏడు మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేశాడు. ఇది కాకుండా ఫాఫ్ డు ప్లెసిస్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదోసారి యాభై పరుగుల మార్క్‌ను దాటాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ 30 సార్లు హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. అలాగే ఫాఫ్ డు ప్లెసిస్ టీ20 క్రికెట్‌లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేశాడు. నిజానికి ఫాఫ్ డు ప్లెసిస్ రాజస్థాన్ రాయల్స్‌పై వరుసగా మూడో అర్ధ సెంచరీని సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... రాజస్తాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (52: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనకు యశస్వి జైస్వాల్ (47: 37 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (34 నాటౌట్: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) పోరాడాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇక బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తప్ప ఇంకెవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో చెత్త ప్రదర్శన కనబరిచారు. కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయారు.