Women's Premier League 2024: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో రాయల్‌ ఛాలెంజర్‌ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబైపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ(RCB).. ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టింది. తొలుత ముంబై(Mumbai)ని 113 పరుగులకే కట్టడి చేసిన బెంగళూరు... తర్వాత 15 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సునాయస విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో ఘనంగా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 113 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆర్సీబీ బౌలర్‌ ఫెర్రీ విజృంభణతో ముంబై బ్యాటర్లకు కష్టాలు తప్పలేదు. ఆరు వికెట్లు నేలకూల్చిన ఫెర్రీ ముంబై పతనాన్ని శాసించింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఫెర్రీ WPLలో కొత్త చరిత్ర సృష్టించింది.



ఫెర్రీ అరుదైన రికార్డు
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌ రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ బెంగళూరు బౌలర్‌... ముంబై ఇండియన్స్‌పై ఏకంగా ఆరు వికెట్లు తీసింది. అది కూడా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి. బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పెర్రీ.. 4 ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లతో చెలరేగింది. డబ్ల్యూపీఎల్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ఒక బౌలర్‌ ఆరు వికెట్లు తీయడం ఇదే ప్రథమం. నేటి మ్యాచ్‌లో పెర్రీ.. ఏకంగా నలుగురు బ్యాటర్లను బౌల్డ్‌ చేయగా ఇద్దరిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపింది. పెర్రీ ధాటికి ముంబై బ్యాటింగ్‌ లైనప్‌ అతలాకుతలమైంది. 


WPLలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన
ఎలీస్‌ పెర్రీ, ఆర్సీబీ-6-15
-మరిజన్నె కాప్‌, ఢిల్లీ - 5-15
ఆశా శోభన, ఆర్సీబీ - 5-22
తారా నోరిస్‌, ఢిల్లీ - 5-29
కిమ్‌ గార్త్‌, గుజరాత్‌ 5-36


మ్యాచ్‌ సాగిందిలా...
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 113 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆర్సీబీ బౌలర్‌ ఫెర్రీ విజృంభణతో ముంబై బ్యాటర్లకు కష్టాలు తప్పలేదు. ఆరు వికెట్లు నేలకూల్చిన ఫెర్రీ ముంబై పతనాన్ని శాసించింది. ఓపెనర్లు సజన(30), హెలీ మ్యాథ్యూస్‌(26) పరుగులతో ముంబైకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 65 పరుగుల వద్ద రెండే వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన ముంబై.. ఆ తర్వాత ఫెర్రీ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్లలో పెర్రీ ఆరు వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినిక్స్‌, సోఫీ డివైన్‌, ఆశ, శ్రేయాంక ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ... సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసిన ఫెర్రీ.. బ్యాటింగ్‌లోనూ రాణించింది. బెంగళూరు 39 పరుగులకే మూడు వికెట్లు పడ్డప్పటికీ ఎలిస్‌ పెర్రీ 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 40 పరుగులు... రిచా ఘోష్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సులతో 36 పరుగులు చేసి మరో వికెట్‌ పడకుండా ఆర్సీబీకి విజయం అందించారు. ముంబై బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, హేలీ మ్యాథ్యూస్‌, నాట్‌సీవర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో ముంబై, ఆర్సీబీ జట్లు తమ లీగ్‌ మ్యాచ్‌లను ముగించాయి. ఇక ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ దాదాపు ఫైనల్‌కు చేరినట్లే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో మరో రెండు జట్లు యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ ఇంటిబాట పట్టాయి. ఢిలీ, గుజరాత్‌ మధ్య మరో నామమాత్రమైన పోరు మిగిలి ఉంది.