IPL 2025 CSK Vs MI Updates: ఐపీఎల్ 2025 ప్రారంభం కావ‌డానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో అన్ని జ‌ట్లు త‌మ స్క్వాడ్ల‌తో ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఈనెల 22 నుంచి అధికారికంగా ఐపీఎల్ ప్రారంభ‌మ‌వుతుంది. డిఫెండింగ్ చాంపియ‌న్స్ కోల్ క‌తా నైట్ రైడర్స్ - రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ తో మెగా టోర్నీ మొద‌ల‌వుతుంది. ఇక ఐదుసార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా త‌న స‌న్నాహ‌కాల‌ను మొద‌లు పెట్టింది. ఈనెల 23న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ముంబై ఇండియ‌న్స్ తో ఆ జ‌ట్టు చెన్నై వేదిక‌గా మ్యాచ్ ఆడ‌నుంది. జ‌ట్టులో వెట‌ర‌న్ బ్యాట‌ర్ ఎంఎస్ ధోనీ అప్పుడే ప్రాక్టీస్ మొద‌లుపెట్టాడు. త‌ను సిక్స్ బాదుతున్న వీడియో సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బౌల‌ర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సిక్స‌ర్ గా ధోనీ బాదాడు. బంతికి తాకినిప్పుడు బ్యాట్ నుంచే వ‌చ్చే సౌండ్ ధోనీ కెపాసిటీని చూపిస్తోంద‌ని ఫ్యాన్స్ ఆనందంగా కామెంట్లు పెడుతున్నారు. క్ష‌ణాల్లో ఈ వీడియో వైర‌లైంది. త‌మ‌కు తోచిన కామెంట్లు చేస్తున్న అభిమానులు, లైకులు, షేర్ల‌తో సోష‌ల్ మీడియాను తెగ హోరెత్తిస్తున్నారు. 






ఐదుసార్లు చాంపియ‌న్ చేసిన ధోనీ..
ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్లు ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స‌. ఈ రెండు టీమ్ లు చెరో ఐదుసార్లు టైటిల్ ను కైవ‌సం చేసుకున్నాయి. ఈసారి టైటిల్ గెలిచి రికార్డు స్థాయిలో ఆరోసారి విజేత‌గా నిల‌వాల‌ని భావిస్తున్నాయి. ఇక 43 ఏళ్ల ధోనీ ఈ టోర్నీ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. 2019లో అంత‌ర్జాతీయ క్రికెట్ కు దూర‌మైన ధోనీ.. ఐదేళ్లుగా కేవ‌లం ఐపీఎల్లో మాత్రమే ఆడ‌తున్నాడు. ఈసారి త‌ను అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ కేట‌గిరీలో బ‌రిలోకి దిగుతున్నాడు. రిటైర్ అయ్యి ఐదేళ్లు దాటిన ప్లేయ‌ర్ల‌ను అన్ క్యాప్డ్ కేట‌గిరీలో ఆడించేందుకు ఐపీఎల్ యాజ‌మాన్యం నిబంధ‌న‌లు రూపొందించ‌డంతో ధోనీ అలా బ‌రిలోకి దిగుతున్నాడు. 



మ‌రికొంత‌కాలం ఆడ‌తా..
క్రికెట్ ను తాను ఆస్వాదిస్తున్నాని, మ‌రింత కాలం క్రికెట్ ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ధోనీ తెలిపాడు. స్కూల్ రోజుల్లో ఎలాగైతే క్రికెట్ ఆడ‌టంలో మ‌జా ఉండేదే, ఇప్ప‌టికీ త‌న‌లో ఆ త‌ప‌న ఉంద‌ని పేర్కొన్నాడు. క్రికెట్ తో క‌లిసి త‌న ప్ర‌యాణం కొన‌సాగిస్తాన‌ని వెల్ల‌డించాడు. గతేడాది ధోనీ.. లోయ‌ర్ మిడిలార్డ‌ర్లో దిగి అద్భుతంగా రాణించాడు. 220కిపైగా స్ట్రైక్ రేట్ తో ప‌రుగులు సాధించాడు. అయితే జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌డంలో మాత్రం విజ‌య‌వంతం కాలేదు. చివ‌రి లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓడి, ఐదోస్థానానికి ప‌రిమిత‌మైంది. 2023లో ఐదో టైటిల్ అందించాక‌, జ‌ట్టు ప‌గ్గాల‌ను యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ కు అప్ప‌గించాడు. ఈ సారి టైటిల్ ఫేవ‌రెట్ హోదాలో చెన్నై బ‌రిలోకి దిగుతోంది.