IPL 2025 DC 6th Win: ఢిల్లీ సిక్సర్ కొట్టింది. సీజన్ లో ఆరో విజయంతో టాప్-2లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. తొలి లెగ్ లో వైజాగ్ లో లక్నోలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన డీసీ.. ఈసారి లక్నోలోనూ తన జాదూ చూపించి, 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ మరో అర్ధ సెంచరీ (33 బంతుల్లో 52, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో సత్తా చాటాడు. ముఖేశ్ కుమార్ నాలుగు వికెట్లతో లక్నోను చక్కగా కట్టడి చేశాడు. అనంతరం ఛేదనను 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి, సునాయసంగా కంప్లీట్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ కేెఎల్ రాహుల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (42 బంతుల్లో 57, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తో జట్టుకు మరోసారి విజయాన్ని అందించాడు. అలాగే ఐపీఎల్లో 5 వేల పరుగుల మార్కును కూడా పూర్తి చేసుకున్నాడు.
మిడిలార్డర్ వైఫల్యం..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు ఓపెనర్లు చక్కని శుభారంభం ఇచ్చారు. మరో ఓపెనర్ మిషెల్ మార్ష్ (36 బంతుల్లో 45, 3 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి మార్క్రమ్ పర్యాటక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మార్ష్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడి, ఐపీఎల్లో 1000 పరుగులను పూర్తి చేసుకోగా, మార్క్రమ్ తన ధాటిని చూపించాడు. వీరిద్దరూ రెచ్చి పోవడంతో పవర్ ప్లేలో 51 పరుగులు వచ్చాయి. ఇదే జోరులో బ్యాటింగ్ చేసిన మార్క్రమ్ 30 బంతుల్లో ఫిఫ్టీ బాది, ఆ తర్వాత ఔటయ్యాడు. ఆ తర్వాత నుంచి లక్నో బ్యాటింగ్ కట్టు తప్పింది. కీలకదశలో విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2) తోపాటు మార్ష్ ఔట్ కావడంతో వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఇక బ్యాటింగ్ లైనప్ లో లక్నో ప్రయోగాలు కూడా బెడిసి కొట్టాయి. పంత్ చివరి రెండు బంతుల్లో బ్యాటింగ్ కు దిగి డకౌటయ్యాడు. అంతకుముందు డేవిడ్ మిల్లర్ (14 నాటౌట్), ఆయుష్ బదోని (21 బంతుల్లో 36, 6 ఫోర్లు) కాస్త బ్యాట్ ఝళిపించడంతో ఆ మాత్రం స్కోరైన సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే లక్నో 30+ పరుగులు అనుకున్న దానికంటే తక్కువగా సాధించి, నిరాశ పరిచింది.
సునాయాసంగా.. బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్ పై ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు మంచి స్టార్టే ఇచ్చారు. కరుణ్ నాయర్ (15) మరోసారి విఫలమైనా, అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్సర్) మాత్రం చాలా వేగంగా ఆడాడు. వీరిద్దరూ 36 పరుగులు జోడించాక కరుణ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ తో కలిసి మరో మ్యాచ్ విన్నింగ్ పార్ట్ నర్ షిప్ ను పోరెల్ నమోదు చేశాడు. వీరిద్దరూ చకచకా పరుగులు చేయడంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించిన పొరెల్, భారీ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్ కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34, 1 ఫోర్, 4 సిక్సర్లు) తో కలిసి సమయోచితంగా ఆడిన రాహుల్.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాహుల్ చాలా చక్కగా ఆడి, 40 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. అలాగే అత్యంత వేగంగా (కేవలం 130 ఇన్నింగ్స్ ల్లో) 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక అక్షర్. నాలుగు సిక్సర్లతో లక్నోను చితక్కొట్టాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్ కు 56 పరుగులను వేగంగా జోడించడంతో ఢిల్లీ సాఫీగా విజయం సాధించింది. బౌలర్లలో మార్క్రమ్ కు రెండు వికెట్లు దక్కాయి.