DC vs LSG IPL 2024 Delhi Innings:  లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) భారీ స్కోరు చేసింది. అభిషేక్‌ పోరెల్‌, షై హోప్‌, రిషభ్‌ పంత్‌, టిమ్ స్టబ్స్‌ రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. పది ఓవర్లలో వంద పరుగులు చేసిన ఢిల్లీ... మరింత భారీ స్కోరు చేస్తుందని భావించినా చివర్లో లక్నో బౌలర్లు పుంజుకోవడంతో బ్యాటర్లు తడబడ్డారు. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటారేమో చూడాలి.

 

ఆరంభంలోనే షాక్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో ఢిల్లీని బ్యాటింగ్‌కు అహ్వానించింది. తొలి ఓవర్‌లోనే ఢిల్లీకి గట్టి షాక్‌ తగిలింది. ఢిల్లీ విధ్వంసకర ఆటగాడు మెక్‌గర్క్‌... పరుగులేమీ చేయకుండానే డకౌట్‌ అయ్యాడు. అర్షద్ ఖాన్‌ వేసిన తొలి ఓవర్‌లోనే భారీ షాట్ ఆడిన మెక్‌గర్క్‌ నవీనుల్ హక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రెండో ఓవర్‌లోనే సిక్స్ బాదిన అభిషేక్ పొరెల్... ఆ తర్వాత ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. అర్షద్ ఖాన్‌ వేసిన మూడో ఓవర్‌లో అభిషేక్‌ 4, 4, 6 బాదడంతో ఆ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకే ఢిల్లీ స్కోరు 50 పరుగులు దాటింది. యుధ్విర్‌ సింగ్ వేసిన నాలుగో ఓవర్‌లో షై హోప్ వరుసగా 4, 4, 6, 2 బాది ఢిల్లీ స్కోరును 50 దాటించాడు.  5 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ ఒక వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 73 పరుగులకు చేరింది. 21 బంతుల్లోనే అభిషేక్ పొరెల్ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కృనాల్ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాది అభిషేక్‌ పోరెల్‌ ఈ సీజన్‌లో రెండో అర్ధ శతకం సాధించాడు. రవి బిష్ణోయ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో 38 పరుగులు చేసిన  షై హోప్ అవుటయ్యాడు. మ్యాచ్‌లో వికెట్‌కీపింగ్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ కవర్స్‌లో అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో షై హోప్ పెవిలియన్‌ చేరాడు. దీంతో 97 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు వంద పరుగులు దాటింది. 

 

పంత్‌ నిలిచినా...

నవీనుల్ హక్‌ వేసిన ఓవర్‌లో భారీ షాట్ ఆడిన  అభిషేక్ పొరెల్.. నికోలస్ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 58 పరుగులు చేసి పొరెల్‌ పెవిలియన్‌ చేరాడు. తర్వాత రిషభ్‌ పంత్‌ ధాటిగా ఆడాడు. మొదటి 10 ఓవర్లు దూకుడుగా ఆడిన ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో పరుగులు పెట్టిన స్కోరు బోర్డు... తర్వాత లక్నో బౌలర్లు పుంజుకోవడంతో నెమ్మదించింది. 16 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 150 పరుగులు దాటింది. ఈ దశలో 33 పరుగులు చేసిన రిషభ్‌ పంత్ అవుట్‌ అయ్యాడు. నవీనుల్ హక్ వేసిన 17 ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన పంత్.. తర్వాతి బంతికే లాంగాన్‌లో దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చాడు. నవీనుల్ హక్ వేసిన 19 ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాది 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.