IPL 2025 CSK 3rd Victory in This Season: ఎట్ట‌కేల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌య‌పు బాట ప‌ట్టింది. నాలుగు ప‌రాజ‌యాల త‌ర్వాత ఒక విజ‌యం సాధించింది. బుధ‌వారం ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన మ్యాచ్ లో ఆతిథ్య కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజ‌న్ లో చెన్నైకిది కేవ‌లం మూడో విక్ట‌రీ కావ‌డం విశేషం. టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 179 ప‌రుగులు చేసింది. అజింక్య ర‌హానే కెప్టెన్ ఇన్నింగ్స్ (33 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో స‌త్తా చాటాడు. బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు వికెట్లు తీశాడు. ఛేజింగ్ లో చెన్నై 19.4 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 183 ప‌రుగులు చేసింది. డెవాల్డ్ బ్రివిస్ విధ్వంస‌క‌ర ఫిఫ్టీ  (25 బంతుల్లో 52, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. వైభ‌వ్ అరోరా కు మూడు వికెట్లు ద‌క్కాయి. ఇక ఈ ఫ‌లితంతో కేకేఆర్ దాదాపు నాకౌట్ నుంచి నిష్క్ర‌మించిన‌ట్లే. 

స‌మ‌ష్టి ప్ర‌ద‌ర్శ‌న‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ క‌తాకు బ్యాట‌ర్లంతా త‌లో చేయి వేయడంతో కాస్త భారీ స్కోరే చేయ‌గ‌లిగింది. ఆరంభంలోనే వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ర‌హ్మానుల్లా గుర్బాజ్ (11) వికెట్ కోల్పోయిన కేకేఆర్ కు సునీల్ న‌రైన్ (26) తో క‌లిసి ర‌హానే.. ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ ద‌శ‌లో ర‌హానే కాస్త సంయమ‌నంతో ఆడ‌గా, న‌రైన్ దూకుడుగా ఆడాడు. వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 58 ప‌రుగులు జోడించారు. అనంత‌రం న‌రైన్ ఔట‌వ‌డం, ఫామ్ లో ఉన్న అంగ్ క్రిష్ ర‌ఘువంశీ (1) విఫ‌లం కావ‌డంతో కేకేఆర్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో మ‌నీష్ పాండే (36) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత ర‌హానే తో క‌లిసి 32 ప‌రుగులు జోడించిన పాండే.. త‌ర్వాత అండ్రీ ర‌సెల్ (38)తో క‌లిసి 46 ప‌రుగులు జోడించాడు. దీంతో కేకేఆర్ కాస్త భారీ స్కోరు సాధించింది. 

వికెట్లు ట‌పాటాపా.. పేల‌వ బ్యాటింగ్ తో స‌త‌మ‌త‌మ‌వుతున్న చెన్నైకి ఛేజింగ్ లోనూ అలంటి ప‌రిస్థితే ఎదురైంది. బ్యాట‌ర్లంతా ఒక‌రి వెనుక ఒక‌రు పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. ఇన్నింగ్స్ రెండో బంతికే సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఆయుష్ మాత్రే డ‌కౌట్ కాగా, ఆ త‌ర్వాత వ‌రుస‌గా డేవ‌న్ కాన్వే డ‌కౌట్, ఉర్విన్ ప‌టేల్ (31) ర‌విచంద్ర‌న్ అశ్విన్ (8), ర‌వీంద్ర జ‌డేజా (19) ఔట్ కావ‌డంతో ఒక ద‌శ‌లో 60 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో బ్రివిస్.. శివ‌మ్ దూబే (45) తో క‌లిసి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్ద‌రూ వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాదారు. దీంతో ఆరోవ వికెట్ కు 67 ప‌రుగులు జోడించి, చెన్నైని మ్యాచ్ ను తిరిగి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏమాత్రం ఒత్తిడి లేకుండా, విధ్వంసకరంగా ఆడి,  22 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన బ్రివిస్.. ఆ త‌ర్వాత భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. ఈ ద‌శ‌లో ఎంఎస్ ధోనీ (17 నాటౌట్) తో క‌లిసి దూబే.. జ‌ట్టును గెలిపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. వీరిద్ద‌రూ ఏడో వికెట్ కు 43 ప‌రుగులు జోడించారు. దీంతో చెన్నై విజ‌యం ముంగిట నిలిచింది. అయితే వెంట‌, వెంట‌నే దూబేతోపాటు నూర్ అహ్మ‌ద్ (2) వికెట్లు కోల్పోవ‌డంతో మ్యాచ్ లో ఒత్తిడి నెల‌కొంది. అయితే చివ‌రి ఓవ‌ర్లో ధోనీ భారీ సిక్స‌ర్ బాద‌డంతో చెన్నై ఈజీగానే విక్ట‌రీ సాధించింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిల‌కు రెండేసి వికెట్లు ద‌క్కాయి.