weather forecast For CSK vs RCB Match: వచ్చే ఆదివారం... మే 18వ తేదీన ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌లోనే కీలక సమరం జరగనుంది. ప్లే ఆఫ్‌ చేరాలని గంపెడు ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)తో.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగవ్వడంతో ఈ మహామహుల యుద్ధం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌... రాజస్థాన్‌ మాత్రమే ప్లే ఆఫ్‌కు చేరాయి. మరో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌ కీలకంగా మారింది. అయితే క్రికెట్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.




 

వర్షం వస్తుందా..?

బెంగళూరు వేదికగా మే 18న చెన్నై, బెంగళూరు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు చాలా కీలకం కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది. బెంగళూరుకు ఈ మ్యాచ్‌ చావోరేవో లాంటింది. ఇందులో ఓడితే బెంగళూరు ప్లే ఆఫ్‌ ఆశలు సన్నగిల్లుతాయి. ఘన విజయం సాధిస్తే ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్‌ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెదర్.కామ్‌ వెల్లడించింది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇదేగనుక జరిగి మ్యాచ్‌ రద్దయితే బెంగళూరు 13 పాయింట్లతో ప్లే ఆఫ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. చెన్నై 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ జరిగితే చెన్నైపై బెంగళూరు 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్‌ తేడాతో గెలవాలి. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే చెన్నై నెట్‌ రన్‌రేట్‌ను బెంగళూరు అధిగమించి ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. 

 

ఈ స్థానాల్లో ఉన్నాయ్‌..

చెన్నై సూపర్ కింగ్స్(CSK) పాయింట్ల పట్టకలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన 14 పాయింట్లు, 0.528 NRRతో ప్లే ఆఫ్‌ రేసులో ఉంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం మెరుగుపడుతుంది. ఒకవేళ చెన్నై చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడితే, మంచి నెట్ రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్‌ చేరుకోవచ్చు. కానీ అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

ఐపీఎల్ రెండో అర్ధభాగంలో వరుసగా అయిదు విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న బెంగళూరు(RCB) ప్లే ఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో నెట్‌ రన్‌రేట్‌ 0.387తో బెంగళూరు  ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. దీంట్లో బెంగళూరు గెలిస్తే చెన్నైతో పాటు 14 పాయింట్లు సాధిస్తుంది. ఇతర సమీకరణాలు అన్నీ కలిసి వస్తే బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది.