Chennai Super Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023 సీజన్ 61వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించంది.


కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కెప్టెన్ నితీష్ రాణా (57 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (54: 43 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. చెన్నై బ్యాటర్లలో శివం దూబే (48 నాటౌట్: 34 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నైకి ఇదే అత్యల్ప స్కోరు.


అదరగొట్టిన నితీష్, రింకూ
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (12: 15 బంతుల్లో), రహ్మనుల్లా గుర్బాజ్ (1: 4 బంతుల్లో), ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యర్ (9: 4 బంతుల్లో, రెండు ఫోర్లు) రాణించలేకపోయారు. దీంతో కోల్‌కతా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో రింకూ సింగ్ (54: 43 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), కెప్టెన్ నితీష్ రాణా (57 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) కోల్‌కతాను ఆదుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించి జట్టును విజయపథాన నడిపించారు. విజయానికి 13 పరుగులు ముంగిట రింకూ సింగ్ అవుటైనా ఆండ్రీ రసెల్‌తో (2 నాటౌట్: 2 బంతుల్లో) కలిసి నితీష్ రాణా మ్యాచ్‌ను ముగించాడు.


శివం దూబే మినహా...
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్  మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (17: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), డెవాన్ కాన్వే (30: 28 బంతుల్లో, మూడు ఫఓర్లు) డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 31 పరుగులు జోడించారు. అయితే పవర్ ప్లే ముగిశాక చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎదురు దెబ్బలు తగిలాయి. కేవలం 12 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత రవీంద్ర జడేజా (20: 24 బంతుల్లో, ఒక సిక్సర్), శివం దూబే (48: 34 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు ఆరో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. అయితే జడేజా మరీ నిదానంగా ఆడాడు. చివరి ఓవర్లో జడేజా అవుటయ్యాడు. చివర్లో వచ్చిన ధోని భారీ షాట్లు కొట్టడంలో విఫలం అయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులకు పరిమితం అయింది.


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ


చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, నిశాంత్ సింధు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జేసన్ రాయ్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి


కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, ఎన్ జగదీసన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్