ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వర్షం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఆలస్యం అయింది. వర్షం చాలా భారీగా పడుతుంది. కాబట్టి ఆట మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ రాత్రి 9:30 కల్లా ప్రారంభం కాకపోతే ఓవర్లలో కోత పడనుంది.


ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు టైటిల్ కోసం తమ సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ పైచేయి సాధించిన రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్వాలిఫయర్ 1లో ఆడిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం తొమ్మిది సార్లు జరిగింది. ఆ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు సార్లు క్వాలిఫయర్ 1లో విజయం సాధించిన జట్టే ఫైనల్‌లోనూ విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.


ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కూడా క్వాలిఫయర్ 1లో ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదు. అది కూడా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది.


2022లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. ఇందులో గుజరాత్ విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. దీని తర్వాత మళ్లీ ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడగా గుజరాత్‌ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.


చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు ఇలా
ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును పరిశీలిస్తే.. 2011 సీజన్ నుంచి 5 సార్లు క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడిన తర్వాత.. అదే జట్టుతో ఫైనల్ మ్యాచ్ కూడా ఆడింది. ఇందులో 2013లో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ముంబైని ఓడించినా, ఫైనల్‌లో ముంబై చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.


2011 సంవత్సరంలో, చెన్నై క్వాలిఫయర్ 1, ఫైనల్‌లో RCBని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. 2015 సీజన్‌లో ముంబైతో జరిగిన క్వాలిఫయర్ 1, ఫైనల్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2018లో చెన్నై క్వాలిఫయర్ 1లో హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌లో కూడా విజయం సాధించింది. 2019 సీజన్‌లో ముంబై క్వాలిఫైయర్ 1, ఫైనల్ రెండింటిలోనూ చెన్నైని ఓడించింది.