Corbin Bosch Joins in Mi Squad: ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఒక మార్పు చేసింది. గాయపడిన సౌతాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ స్థానంలో అదే దేశానికి చెందిన ఆల్ రౌండర్ కార్బిన్ బోష్ ను జట్టులోకి తీసుకుంది. 86 టీ20లు ఆడిన అపార అనుభవం గల 30 ఏళ్ల బోష్.. 59 వికెట్లు తీశాడు. మోకాలి గాయంతో విలియమ్స్ టోర్నీ నుంచి వైదొలిగాడని టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ఈ సౌతాఫ్రికన్ కి ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 81 కావడం విశేషం. తనను తీసుకోవడం ద్వారా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ జట్టును మరింత బలోపేత చేయగలదని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక జాతీయ జట్టు తరపున అంతర్జాతీయంగా కొన్ని మ్యాచ్ లను ఆడాడు. ఒక టెస్టు, రెండు వన్డేలు అతను ఆడాడు. ఇక తను ఇంతకుముందు ఐపీఎల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 2022లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ గా తను సేవలందించాడు. అలాగే అదే ఏడాది ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్టర్ నీల్ గాయపడితే అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు.
ఎస్ఏ20లోనూ..
ఇక ఈ ఏడాది సౌతాఫ్రికా (ఎస్ఏ 20) టోర్నీలో ముంబై ఇండియన్స్ కేప్ టైన్ తరపున బోష్ ప్రాతినిథ్యం వహించాడు. తను ఈ టోర్నీలో విశేషంగా రాణించి, 11 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో అటు విలియమ్స్ గాయపడగానే తన స్థానంలో బోష్ ను జట్టులోకి ఎంపికయ్యాడు. ఇక అతను 2014లో సౌతాఫ్రికా అండర్-19 చాంపియన్ గా నిలవడంలోనూ కీ రోల్ పోషించాడు. ఫైనల్లో 4-15తో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
ఫుల్ జోష్ లో ముంబై..
టోర్నీని రికార్డు స్థాయిలో ఐదుసార్లు నెగ్గిన ముంబై.. గతేడాది చెత్త ప్రదర్శన చేసింది. చెత్త ఆటతీరుతో టోర్నీలో అట్టడుగు స్థానం సంపాదించింది. దీంతో జట్టును కాస్త ప్రక్షాళన చేసి, మెగా వేలంలో ఖతర్నాక్ ఆటగాళ్లతో జట్టును నింపారు. ఈ ఏడాది కూడా హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతేడాది ఐపీఎల్లో తన కెప్టెన్సీని సొంత జట్టు అభిమానులే అంగీకరించలేక పోయారు. టీమ్ ను ఐదుసార్లు చాంపియన్ గా నిలిపిన రోహిత్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడం ఫ్యాన్స్ కు రుచించలేదు. దీంతో అటు హార్దిక్ ను ఇటు టీమ్ మేనేజమెంట్ ను ట్రోల్ చేశారు. అయితే ఆ తర్వాత భారత్ టీ20 ప్రపంచకప్ తోపాటు చాంపియన్స్ ట్రోఫీ సాధించడం, అలాగే పలు విజయాల్లో హార్దిక్ కీలక పాత్ర పోషించడంతో అతనిపై ఉన్న నెగిటివిటీ పూర్తిగా పోయింది. దీంతో సరికొత్త జోష్ లో జట్టును నడిపించాలని అతను భావిస్తున్నాడు. ఈసారి తెలుగు ప్లేయర్ తిలక్ వర్మపై అందరి దృష్టి నెలకొంది. ఈనెల 22న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమవుతుండగా, 23న చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై తలపడనుంది.