IPL 2025 Rishabh Pant Captains Innings: ఎట్టకేలకు చెన్నై తన పరాజయాల పరంపరను ఛేదించింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లతో చెన్నై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో రెండో గెలుపును సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరింగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 166 ప‌రుగులు చేసింది. రిష‌భ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (49 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కీల‌క‌ద‌శ‌లో  ఫామ్ లోకి వ‌చ్చాడు. బౌల‌ర్లలో ర‌వీంద్ర జ‌డేజా, మ‌తీషా ప‌తిరాణ‌కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌లో చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్ల‌కు 168 ప‌రుగులు చేసి, కంప్టీట్ చేసింది. ఓపెనర్ ర‌చిన్ ర‌వీంద్ర  (22 బంతుల్లో 37, 5 ఫోర్లు) ఛేజింగ్ లో శుభారంభాన్ని అందించాడు. శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు ) టాప్ స్కోరర్ గా నిలిచి, చివరికి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్ కి 2 వికెట్లు తీశాడు. 

Continues below advertisement






పంత్ విధ్వంసం.. 
ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ల‌క్నోకు ఆరంభంలోనే ఐడెన్ మార్క్ర‌మ్ (6) వికెట్ రూపంలో షాక్ త‌గిలింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే సూప‌ర్ ఫామ్ లో ఉన్న నికోల‌స్ పూర‌న్ (8) పెవిలియ‌న్ కు చేరాడు. ఈద‌శ‌లో ఓపెన‌ర్ మిషెల్ మార్ష్ (30) తో క‌లిసి పంత్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన పంత్.. ఆ త‌ర్వాత గేర్లు మార్చాడు. మార్ష్ కూడా వేగంగా ఆడ‌టానికే చూడ‌టంతో స్కోరు బోర్డు వేగంగా ప‌రుగులెత్తింది. వీరిద్దరూ 3వ వికెట్ కు 50 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత భారీ షాట్ ఆడే ప్ర‌య‌త్నంలో మార్ష్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత రెండు లైఫ్ లు ద‌క్కినా, స‌ద్వినియోగం చేసుకోలేని ఆయుష్ బ‌దోనీ (22) విఫ‌ల‌మ‌య్యాడు. మ‌రో ఎండ్ లో పంత్ వేగంగా ఆడుతూ 42 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజ‌న్ లో అత‌నికిదే తొలి ఫిఫ్టీ కావ‌డం విశేషం. చివ‌ర్లో రెండు సిక్స‌ర్ల‌తో అబ్దుల్ స‌మ‌ద్ (20) విరుచుకుప‌డ్డాడు. అయితే చివ‌రి ఓవ‌ర్లో వీరిద్ద‌రూ ఔట‌వ‌డంతో అనుకున్న‌దానికంటే కాస్త త‌క్కువ స్కోరుతోనే ల‌క్నో సంతృప్తి ప‌డింది.






గుంటూరు కుర్రాడి సూప‌ర్ ట‌చ్..
వ‌రుస ప‌రాజ‌య‌ల‌తో కునారిల్లుతున్న చెన్నై.. ఈ మ్యాచ్ లో చాలా మార్పులు చేసింది. తెలుగు కుర్రాడు, గుంటూరుకు చెందిన షేక్ ర‌షీద్ (19 బంతుల్లో 27, 6 ఫోర్లు) ను ఓపెన‌ర్ పంపించింది. అత‌ను అద్భుత‌మైన టైమింగ్ తో ఆరు బౌండ‌రీలు బాది, రెగ్యుల‌ర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను మ‌రిపించాడు. మ‌రో ఎండ్ లో మ‌రో ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర వేగంగా ఆడ‌టంతో ప‌వ‌ర్ ప్లేలో సీఎస్కే 59 ప‌రుగులు సాధించింది. అంత‌కుముందు ర‌షీద్.. పుల్ షాట్ కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. అయితే ఈ ద‌శ‌లో మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం చెన్నైకి త‌లనొప్పిగా మారింది. రాహుల్ త్రిపాఠి (9), ర‌వీంద్ర జ‌డేజా (7), విజ‌య్ శంక‌ర్ (9) విఫ‌ల‌మ‌య్యారు. ఇక శివ‌మ్ దూబే, కెప్టెన్ ఎంఎస్ ధోనీ (11 బంతుల్లో 26 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా ధోనీ వేగంగా ఆడటంతో అప్పటిదాక స్లోగా ఆడిన దూబే.. కూడా బ్యాట్ ఝళిపించి, జట్టును గెలిపించారు. వీరిద్దరూ అబేధ్యమైన ఆరో వికెట్ కు 57 పరుగులు జోడించారు. ఇక 5 మ్యాచ్ ల్లో వరుస పరాజయాల తర్వాత ఈ మ్యాచ్ గెలిచినా, నెట్ రన్ రేట్ వల్ల చెన్నై పదో స్థానంలోనే నిలిచింది.