IPL 2023 Final Reserve Day CSK vs GT: IPL 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం ఆడలేదు. ఇకపై సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సోమవారం ఫైనల్‌కు రిజర్వ్ అయింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం ఆటను చెడగొట్టింది. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా చాలా సేపు వర్షం ఆగుతుందా అని ఎదురుచూశారు. కానీ వర్షం ఆగలేదు.
వర్షం కారణంగా ఆదివారం చెన్నై గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగలేదు. ఈ మేరకు ఐపీఎల్ ఓ ట్వీట్ చేసింది. "ఐపీఎల్ 2023 ఫైనల్ రేపు, మే 29వ తేదీ (రిజర్వ్డ్ డే) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈరోజు టిక్కెట్లు రేపటికి కూడా చెల్లుబాటు అవుతాయి. వాటిని సురక్షితంగా ఉంచమని మేం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము." అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.
ఐపీఎల్ చరిత్రలో రిజర్వ్ డే రోజున ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఐపీఎల్ ఫైనల్‌కు సంబంధించి చాలా రకాల నిబంధనలను రూపొందించింది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లలో ఓవర్లు కట్ చేస్తారు. 11 గంటల లోపు వర్షం ఆగి ఉంటే మ్యాచ్ ప్రారంభం అయ్యేది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా సాధ్యం అయ్యేది. ఇది కూడా లేకపోతే సూపర్ ఓవర్ కూడా జరిగి ఉండేది. కానీ వర్షం కొనసాగింది. ఈ కారణంగా ఇది రిజర్వ్ డేకి మారింది. ఫైనల్ మ్యాచ్‌కు మరో రోజు కేటాయించారు.
ఐపీఎల్ 2023 ఫైనల్లో ఢీకొంటున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs GT Final) మధ్య ఇంట్రెస్టింగ్ రైవల్రీ కొనసాగుతోంది! కొందరు ఆటగాళ్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఆధిపత్యం వహిస్తారో, ఎవరు తేలిపోతారో చూడాలి!
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వేపై గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమికి అద్భుతమైన రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌లో కాన్వే మూడు ఇన్సింగ్సుల్లో 12 బంతులాడి ఐదు పరుగులే చేశాడు. మూడు సార్లు ఔటయ్యాడు. గైక్వాడ్ వికెట్ ఇవ్వనప్పటికీ 69.69 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. 66 బంతుల్లో 46 మాత్రమే కొట్టాడు. పైగా షమీకి అహ్మదాబాద్‌లో అమేజింగ్ రికార్డ్ ఉంది. 6.77 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు.
రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడుకి రషీద్ ఖాన్‌పై మంచి రికార్డు ఉంది. వారిద్దరూ అతడి బౌలింగ్‌ను ఉతికారేస్తారు. రషీద్‌పై గైక్వాడ్‌కు 147.36 స్ట్రైక్‌రేట్ ఉంది. ఆరు మ్యాచుల్లో 57 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రెండుసార్లే ఔటయ్యాడు. ఇక రాయుడికి 124.65 స్ట్రైక్‌రేట్ ఉంది. 73 డెలివరీల్లో రెండుసార్లు మాత్రమే ఔటయ్యాడు.