Bumrah Creates History In Ipl 2024 : బెంగళూరు(Rcb)) జరిగిన మ్యాచ్‌లో బుమ్రా(Bumrah) అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. బెంగళూరు బ్యాటర్లు కుదురుకున్న ప్రతీసారి వికెట్ తీసిన బుమ్రా.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లతో నిప్పులు చెరిగిన బుమ్రా.. ఆర్‌సీబీ(RCB) పతనాన్ని శాసించడంతో పాటు పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
బుమ్రా రికార్డు
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అయిదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఆశిష్ నెహ్రా.. 2015 సీజన్‌లో బెంగళూరుపై నాలుగు వికెట్లు తీశాడు. ఆర్సీబీపై ఒక బౌలర్ తీసిన అత్యధిక వికెట్లు ఇవే. ఇప్పుడు ఈ రికార్డును బుమ్రా అధిగమించాడు. మరో ఘనతను బుమ్రా తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న నాలుగో బౌలర్‌గా బుమ్రా ఖ్యాతినార్జించాడు. బుమ్రా కంటే ముందు ఫాల్క్‌నర్, జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఫీట్ సాధించారు. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ బుమ్రా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు బుమ్రా ఆర్‌సీబీతో మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు.
బెంగళూరు ఓటమి
ఐపీఎల్‌లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం... మూడే పరుగులు చేసి వెనుదిరిగాడు. బెంగళూరు సారధి ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్ అర్ధ శతకాలతో మెరిశారు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రాణించగా... సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్‌తో ముంబైకు ఘన విజయాన్ని కట్టపెట్టాడు. ఇషాన్ కిషన్ 69, రోహిత్ శర్మ 38 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు.