IPL 2024: టాస్ గెలిచిన ఆర్సీబీ ఉప్పల్‌లో బ్యాటింగ్ చేస్తోంది. ఫాఫ్ డుప్లెసి వికెట్ పడింది. 121 డెసిబల్స్‌తో సన్ రైజర్స్ ఫ్యాన్స్ గోల గోల చేశారు. తర్వాత పటిదార్ వికెట్ పడింది సేమ్ 121 డెసిబల్స్‌తో రచ్చ రచ్చ. కీలకమైన కొహ్లీ వికెట్ పడింది. సేమ్ 121 డెసిబల్స్‌తో స్టేడియం మొత్తం రీసౌండ్. ప్రత్యర్థులను చిత్తు చేయటం వాళ్లు నిశ్శబ్దంగా నిష్క్రిమిస్తుంటే ఆ సైలెంట్‌ని వైలెంట్‌గా ఎంజాయ్ చేయటం ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో సన్ రైజర్స్ చేసింది ఇదే. వరుసగా నాలుగు మ్యాచులు గెలిచిన ఉత్సాహంలో ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు  వాళ్ల వికెట్లు పడుతుంటే ఇదే రేంజ్‌లో గోల చేశారు. 


కానీ సెకండాఫ్‌లో 207పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ అరివీర భయంకరమైన బ్యాటర్లు ఒక్కరు ఒక్కరుగా పెవిలియన్ దారి పడుతుంటే నిశ్శబ్దం. సైలెన్సర్‌గా పిలుచుకునే ప్యాట్ కమిన్స్ గ్యాంగ్ ఈ రేంజ్‌లో కుప్పకూలుతుంది ఎవరూ ఊహించి ఉండరు. ఆరు మ్యాచులు ఓడిపోయిన ఆర్సీబీ బౌలర్లు ఈ రేంజ్‌లో రెచ్చిపోతారని ఎవరూ అనుకుని ఉండరు. 




మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చాలు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎలా ఫ్రస్ట్రేట్ అయ్యారో చెప్పటానికి. మొత్తానికి వరుస విజయాల భారీ విక్టరీలతో ఊపు మీదున్న సన్ రైజర్స్‌కి ఆర్సీబీ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో పరిచయం చేసిందన్నమాట.


ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది బెంగళూరు జట్టు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. అరవీర భయంకరమైన బ్యాటింగ్ లైనప్‌ ఉన్న హైదరాబాద్ లక్ష్య ఛేదనలో తేలిపోయింది. కేవలం 171 పరుగులకే చాపచుట్టేసింది. 




బౌలింగే ఆర్సీబీ బలం- నెల తర్వాత అదే గెలిపించింది.!
మ్యాచ్‌లో ఆర్సీబీని గెలిపించింది బౌలింగే. లేదంటే సన్ రైజర్స్ బ్యాటర్లు ఉన్న ఫామ్ కి 207పరుగుల లక్ష్యం అనేది చాలా చిన్నది. కీలక బ్యాటర్లంతా మూకుమ్ముడిగా విఫలమైనా సరే సన్ రైజర్స్ 171పరుగులు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉందో. మరి అలాంటి మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు నిన్న ఇరగదీశారు. ప్రత్యేకించి కేమరూన్ గ్రీన్ ఆల్ రౌండర్ ఫర్ఫార్మెన్స్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు తీసి సన్ రైజర్స్ నడ్డి విరిచారు. సన్ రైజర్స్ టీమ్‌లో ప్రమాదకరమైన బ్యాటర్లు అభిషేక్ శర్మను యశ్ దయాల్, ట్రావియెస్ హెడ్ ను విల్  జాక్స్ అవుట్ చేస్తే...ఏడెన్ మార్ క్రమ్, హెన్రిచ్ క్లాసెన్  వికెట్లు ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ తీసి ఆరెంజ్ ఆర్మీకి షాక్ ఇచ్చాడు.


టాలెంటెడ్ ప్లేయర్స్ నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ లను కర్ణ్ శర్మ పెవిలియన్ కి పంపితే..కాసేపు సిక్సులతో రెచ్చిపోయిన కమిన్స్, భువనేశ్వర్ సంగతి గ్రీన్ చూసుకున్నాడు. పైగా ఫీల్డింగ్ లోనూ ఆర్సీబీ అద్భుతాలు చేసింది. బౌండరీల డైవ్ లు కొడుతూ సన్ రైజర్స్ పై ఒత్తిడి పెంచింది. ఇలా ఎప్పుడూ ఉండే బ్యాటింగ్ కి తోడూ..ఈసారి బౌలర్లు, ఫీల్డర్లు సమష్ఠిగా రాణించటంతో సన్ రైజర్స్ ను హోమ్ గ్రౌండ్ లో ఓడించి వాళ్ల వరుస విజయాలకు బ్రేక్ వేసింది రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు.


ఇంకో అద్భుతం ఏంటంటే సరిగ్గా మార్చి 25న పంజాబ్ పై తమ ఆఖరి విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ...తిరిగి ఏప్రిల్ 25న అంటే సరిగ్గా నెల తర్వాత హైదరాబాద్ మీద రెండో విజయాన్ని నమోదు చేసింది. అంటే ఒక్క విక్టరీ కోసం నెలరోజులు వెయిట్ చేసింది ఆర్సీబీ టీమ్.