Axar Patel Registers Second Lowest Batting Average as Captain: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఆ జట్టు సారథి అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఫామ్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్ అక్షర్ కు ఒక పీడకలలా మిగిలిపోయింది. ఈ సీజన్ లో అతను బ్యాట్ తో అస్సలు ప్రభావం చూపలేకపోతున్నాడు. తాజా మ్యాచ్ లో విఫలం అవ్వడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
అత్యల్ప సగటున్న కెప్టెన్ల లిస్ట్..ఒక ఐపీఎల్ సీజన్ లో కనీసం 7 ఇన్నింగ్స్ లు ఆడిన కెప్టెన్లను పరిగణనలోకి తీసుకుంటే, అక్షర్ పటేల్ యావరేజ్ (6.28) రెండో స్థానంలో ఉంది. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ షేన్ వార్న్ (2.00 యావరేజ్, 2010 సీజన్) ఉన్నాడు. అక్షర్ తర్వాత ఇయాన్ మోర్గాన్ (11.08), హర్భజన్ సింగ్ (12.00), రవిచంద్రన్ అశ్విన్ (12.75) వంటి వారు ఉన్నారు. భారీ హిట్టింగ్ తో మ్యాచ్ లు గెలిపించాల్సిన కెప్టెన్ ఇలా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అవ్వడం ఢిల్లీకి పెద్ద మైనస్ పాయింట్ అయింది.
స్ట్రైక్ రేట్ సమస్య..ప్రస్తుత ఐపీఎల్ లో బ్యాటర్లు 200 పైచిలుకు స్ట్రైక్ రేట్ తో విరుచుకుపడుతుంటే, అక్షర్ పటేల్ మాత్రం టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ తరహాలో ఆడుతున్నాడు. ఈ సీజన్ లో కనీసం 50 బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లలో అక్షర్ స్ట్రైక్ రేట్ (74.57) అందరికంటే తక్కువ. టీ20 ఫార్మాట్ లో ఇలాంటి బ్యాటింగ్ టీమ్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టడంలో అతను పూర్తిగా తడబడుతున్నాడు.
కేకేఆర్ స్పిన్నర్ల ధాటికి ఢిల్లీ విలవిల..ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ స్పిన్నర్లు సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ఆతిథ్య జట్టును ఊపిరి తీసుకోనివ్వలేదు. ఓపెనర్లు పాతుమ్ నిసాంక (50), కేఎల్ రాహుల్ (23) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కేకేఆర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. సునీల్ నరైన్ ప్రమాదకరమైన సమీర్ రిజ్వీని అవుట్ చేయగా, అనుకుల్ రాయ్ ఒకే ఓవర్లో నిశ్శంక, ట్రిస్టన్ స్టబ్స్ లను పెవిలియన్ పంపి ఢిల్లీ వెన్ను విరిచాడు.
ఆదుకున్న అశుతోష్ శర్మ..ఒకానొక దశలో ఢిల్లీ కనీసం 100 పరుగులు కూడా చేయలేని స్థితిలో ఉంది. ఆ సమయంలో యంగ్ ప్లేయర్ అశుతోష్ శర్మ 28 బంతుల్లో 39 పరుగులు చేసి స్కోరును 142కు చేర్చాడు. అతని పోరాటం లేకపోతే ఢిల్లీ పరువు దక్కేది కాదు. అక్షర్ పటేల్ ఫామ్ పై ఢిల్లీ కోచ్ హేమాంగ్ బదానీ స్పందిస్తూ.. ప్రదర్శన చేయాలి లేదా తప్పుకోవాలి' (Perform or Perish) అనే స్థితిలో జట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్ లలో పుంజుకోవాలంటే కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాట్ ఝుళిపించడం చాలా ముఖ్యం.
