AB De Villiers News: సౌతాఫ్రికా మాజీ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ కు ఇండియాలో కూడా ఫ్యాన్స్ అధిక సంఖ్య‌లో ఉంటారు. 360 డిగ్రీల ఆట అనే ప‌దం డివిలియ‌ర్స్ ఆట‌ను చూసి వ‌ర్ణించేవారు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఐపీఎల్లో ఆడ‌టం ద్వారా త‌ను ఇండియ‌న్స్ కు మ‌రింత చేరువ అయ్యాడు. ముఖ్యంగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఆడుతూ, ఒక రేంజీకి చేరుకున్నాడు. స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీతో స్నేహం కూడా అత‌డిని ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉంచింది. అయితే అత‌ని ఐపీఎల్ కెరీర్ 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్ర‌స్తుత ఢిల్లీ క్యాపిట‌ల్స్ )తో ప్రారంభ‌మైంది. అయితే ఆ జ‌ట్టుపై ఏబీ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాను చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌న కామేంట్ల‌పై నెటిజ‌న్లు చ‌ర్చ‌లు చేస్తూ, లైకులు, కామెంట్లు చేస్తూ షేర్ల‌తో హోరెత్తిస్తున్నారు. 

విష పురుగులు..ఢిల్లీ జ‌ట్టులో గొప్ప ఆట‌గాళ్ల‌తో పాటు విష పురుగుల్లాంటి వారు ఉండేవార‌ని డివిలియ‌ర్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాను ఆ జ‌ట్టు త‌ర‌పున అంత‌గా రాణించ‌క‌పోవ‌డానికి కార‌ణం అలాంటి వారేన‌ని పేర్కొన్నాడు. అయితే వారి పేర్ల‌ను మాత్రం బ‌య‌ట పెట్ట‌లేదు. వాళ్ల‌తో క‌లిసి ఆడ‌టం చాలా బాధ‌క‌రంగా ఉండేద‌ని పేర్కొన్నాడు. అయితే అదే స‌మ‌యంలో జ‌ట్టులో గ్లెన్ మెక్ గ్రాత్, డేనియ‌ల్ వెటోరీ లాంటి ప్లేయ‌ర్లు ఉండేవార‌ని, వారితో క‌లిసి డ్రెస్సింగ్ రూంని పంచుకోవ‌డం మ‌రిచిపోలేని అనుభ‌వ‌మ‌ని వ్యాఖ్యానించాడు.. 

చాలా స‌ర‌దాగా..2006లో ఆస్ట్రేలియాతో సిరీస్ సంద‌ర్భంగా మెక్ గ్రాత్ ను ఎదుర్కొన్నాన‌ని, అయితే అప్పుడు అత‌నితో మాట్లాడేందుకు కూడా త‌ట‌ప‌టాయించేవాడిన‌ని డివిలియ‌ర్స్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఢిల్లీ టీమ్ లో ఆడుతున్న‌ప్పుడు ఒకే చోట ఉండి, అభిప్రాయాల‌ను షేర్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని, ఇదంతా ఐపీఎల్ వ‌ల్లేన‌ని ప్ర‌శంసించాడు. ఇక ఢిల్లీకి ఆడిన తర్వాత ఆర్సీబీకి వ‌చ్చిన త‌ర్వాత డివిలియ‌ర్స్ దశే మారిపోయింది. జ‌ట్టులో తాను చాలా ఇంపార్టెంట్ ప్లేయ‌ర్ గానూ మారిపోయాడు. ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్ ఫైన‌ల్ కి కూడా హాజ‌రై, ఆర్సీబీకి మ‌ద్ధ‌తు తెలిపాడు. జ‌ట్టు క‌ప్పు సాధించడంతో, త‌ను కూడా ఆనంద డోలిక‌ల్లో మునిగిపోయాడు. అయితే ఇప్పుడు ఏబీని అంత‌గా ఇబ్బంది పెట్టిన ఆ క్రికెటర్లు కానీ, టీమ్ మేనేజ్మెంట్ ఎవ‌రా..? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ క్వ‌శ్చ‌న్ గా మారిపోయింది. ఏదేమైనా ఢిల్లీ నుంచి ఆర్సీబీకి వ‌చ్చిన ఏబీకి మంచే జ‌రిగింద‌ని, అశేష ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈనెల డివిలియర్స్ కు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎన్నాళ్లుగానే వేచి చూస్తున్న రెండు కలలు తీరాయి. అందులో ఒకటి ఆర్సీబీ టైటిల్ సాధించడం, రెండోది, సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ గెలుపొందడం, 1998 తర్వాత తొలిసారి ప్రొటీస్ ఐసీసీ టైటిల్ నెగ్గింది.