MI Head Coach:  ముంబయి ఇండియన్స్‌కు కోచింగ్‌ బృందంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే సీజన్లో జట్టుకు కొత్త కోచ్‌ రానున్నాడు. మహేలా జయవర్దనె స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్‌ బౌచర్‌ బాధ్యతలు తీసుకుంటాడని తెలుస్తోంది. ఆఖరి క్షణంలో అనుకోని మార్పులు జరిగితే తప్ప అతడి ఎంపిక ఖాయమేనని సమాచారం.


నిజానికి SA20 లీగులో ఎంఐ కేప్‌టౌన్‌కు మార్క్‌ బౌచర్‌ కోచ్‌గా ఎంపికవుతాడని భావించారు. చివరి నిమిషాల్లో సైమన్‌ కటిచ్‌ను తీసుకున్నారు. అతడికి డిప్యూటీగా హసీమ్ ఆమ్లాను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌ కోచ్‌గా తీసుకున్నారు. జేమ్స్‌ పమ్మెంట్‌ ఫీల్డింగ్‌ కోచ్‌, రాబిన్‌ పీటర్సన్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉంటారు.


టీ20 ఫ్రాంచైజీ క్రికెట్లో సైమన్‌ కటిచ్‌కు విశేష అనుభవం ఉంది. అతడి సేవలకు గిరాకీ బాగానే ఉంది. గతంలో చాలా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు ఆయన పనిచేశాడు. కేకేఆర్‌లో జాక్వెస్‌ కలిస్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు హెడ్‌కోచ్‌గా చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు రెండు నెలలు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేశాడు. ఈ మధ్యే హండ్రెడ్‌ టోర్నీలో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌కు హెడ్‌కోచ్‌గా అద్భుతాలు చేశాడు. జట్టును రన్నరప్‌గా నిలిపాడు.


ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు క్రేజ్‌ పెరిగింది. దాదాపుగా అన్ని క్రికెటింగ్‌ దేశాల్లో టీ20 లీగులు పెడుతున్నారు. దాంతో ఇతర లీగుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జట్లను సొంతం చేసుకుంటోంది. దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్‌, యూఏఈ ఐఎల్‌టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు కలిపి కోచింగ్‌ విషయాల్లో మార్పులు చేసింది. 2017 నుంచి ముంబయి ఇండియన్స్‌కు కోచ్‌గా ఉన్న మహేలా జయవర్దనెను గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్ పెర్ఫామెన్స్‌, జహీర్‌ ఖాన్‌ను గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్ క్రికెట్‌ డెవలప్‌మెంట్‌గా నియమించింది. వీరిద్దరూ ఇకపై మూడు జట్ల కార్యకలాపాల్లో కీలకంగా ఉంటారు.


ప్రస్తుతం మార్క్‌ బౌచర్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఈ మధ్యే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీసులో సఫారీలు 1-2 తేడాతో ఓటమి పాలయ్యారు. దాంతో టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో ఆఫర్లు రావడమే ఇందుకు కారణంగా తెలిసింది. 2016లో కేకేఆర్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా బౌచర్‌ పనిచేశాడు. అంతకు ముందు కేకేఆర్‌, ఆర్సీబీ తరఫున ఆడాడు. అంతకు మించి ఐపీఎల్‌లో అనుభవం లేదు. దక్షిణాఫ్రికా జట్టు, దేశవాళీ టైటాన్‌కు కోచ్‌గా పనిచేశాడు.