Rashid Khan No.1 T20I Bowler: IPL 16వ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ సీజన్ ప్రారంభానికి ముందు గొప్ప వార్తను అందుకుంది. టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్‌లో ఆ జట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ లాంగ్ జంప్ చేసి మొదటి స్థానానికి చేరుకున్నాడు. వనిందు హసరంగాను కూడా దాటేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఐసీసీ T20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రషీద్‌కు ఈ స్థానం లభించింది. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగాను దాటి రషీద్ ఖాన్ మొదటి ర్యాంక్ సాధించాడు. ఇంతకు ముందు కూడా 2018 సంవత్సరంలో రషీద్ నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు.


ఐపీఎల్ ప్రారంభానికి రెండు రోజుల ముందు రషీద్ ఖాన్ నంబర్ వన్ టీ20 బౌలర్‌గా నిలిచాడు. అటువంటి పరిస్థితిలో అతను ఐపీఎల్ 16వ సీజన్‌లో కూడా తన బంతి మ్యాజిక్‌ను చూపించడం ఖాయం అని చెప్పవచ్చు. గతేడాది గుజరాత్ టైటాన్స్‌తో కలిసి రషీద్ ఖాన్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతని ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే ఈ గ్రాండ్ లీగ్‌లో రషీద్ ఖాన్ ఇప్పటివరకు మొత్తం 92 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 6.38 అద్భుతమైన ఎకానమీతో 112 వికెట్లు పడగొట్టాడు.


IPL 2023 మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో రషీద్ తన బంతులతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇబ్బంది పెట్టనున్నాడు. రషీద్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేయగలడు. గత సంవత్సరం అతను తన ఫాస్ట్ బ్యాటింగ్‌తో జట్లకు తనను కేవలం బౌలర్‌గా పరిగణించవద్దని మెసేజ్ ఇచ్చాడు.


అఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఇటీవలే అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. పొట్టి ఫార్మాట్ లో తన కెరీర్ లో రషీద్ ఖాన్ 500 వికెట్లు తీశాడు. 


దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్- ముంబయ్ కేప్ టౌన్ మధ్య జరిగిన మ్యాచ్ లో రషీద్ టీ20 ఫార్మాట్ లో తన 500వ వికెట్ ను సాధించాడు. పొట్టి ఫార్మాట్ లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు. అలాగే ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గానూ అవతరించాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 614 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


ఈ మ్యాచ్ కు ముందు అతను 497 వికెట్లతో ఉన్నాడు. ఈ టీ20 లీగ్ లో రషీద్ ముంబై కేప్ టౌన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీయటంతో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. అయితే రషీద్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ముంబై కేప్ టౌన్ 52 పరుగుల తేడాతో ఓడిపోయింది.