ABP CVoter Karnataka Opinion Poll Results:


కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ABP CVoter Opinion Poll వెల్లడించింది. దాదాపు అన్ని కీలకప్రాంతాల్లో ఈ పార్టీకే మెజార్టీ దక్కుతుందని తెలిపింది. 


అంచనాలు..


కర్ణాటకలోని నియోజకవర్గాలను సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, గ్రేటర్ బెంగళూరు, హైదరాబాద్ కర్ణాటక, ముంబయి కర్ణాటక, ఓల్డ్ మైసూర్‌గా విభజించి చూస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ABP CVoter సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా చూసి కొన్ని అంచనాలు వెలువరించింది. వీటి ఆధారంగా చూస్తే...గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38% ఓట్లు దక్కాయి. ఈ సారి అది 40%కి పెరిగే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే...గత ఎన్నికల్లో 36% ఓట్లు రాబట్టుకుంది. ఈ సారి 34.7%కే పరిమితమయ్యే అవకాశమున్నట్టు ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఇక మరో కీలక పార్టీ JDSకి గత ఎన్నికల్లో 18% ఓట్లు సాధించింది. ఈ సారి 17.9% వరకూ సాధించే అవకాశముంది. ఇతర పార్టీలకు 7.3% ఓట్లు దక్కనున్నట్టు అంచనా వేసింది. 


ఎవరికెన్ని సీట్లు..?


సీట్ల పరంగా చూస్తే...గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తరవాత బీజేపీ చేతుల్లోకి అధికారం మారిపోయింది. అయితే...ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే...కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74,JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 




సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 41.2%,బీజేపీకి 37.7%,జేడీఎస్‌కు 13.1% ఓట్లు దక్కే అవకాశమున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 18-22 సీట్లు, బీజేపీకి 12-16, జేడీఎస్‌కు  ఒక స్థానం దక్కనున్నట్టు అంచనా. ఇక కోస్టల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 41.2% ఓట్లు, 8-12 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇదే ప్రాంతంలో బీజేపీకి 46.2% ఓట్లు, 9-13 సీట్లు రానున్నట్టు తేలింది. అత్యంత కీలకమైన గ్రేటర్ బెంగళూరులోనూ...కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండనున్నట్టు అంచనా. ఇక్కడ కాంగ్రెస్‌కు 38.6% ఓట్లు, 15-19 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే...36.8% ఓట్లు, 11-15 సీట్లు దక్కనున్నాయి. తెలుగు వాళ్లు అధికంగా ఉండే హైదరాబాద్ కర్ణాటకలో...కాంగ్రెస్‌కు 43.7% ఓట్లు దక్కనున్నట్టు అంచనా. ఇక్కడ ఆ పార్టీకి 19-23 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. ముంబయి కర్ణాటక, ఓల్డ్‌ మైసూర్‌లోనూ కాంగ్రెస్‌కే మొగ్గు ఎక్కువగా ఉంది. 








ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలివే..


కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగం కీలకంగా మారనుంది. దాదాపు 29.1% మేర ఎఫెక్ట్ ఈ అంశానిదే ఉండనుందని ABP CVoter Opinion Pollలో తేలింది. విద్యుత్, నీళ్లు, రహదారుల అంశాలు 21.5 % మేర ప్రభావం చూపనున్నాయి. ఇక కరోనా ప్యాండెమిక్‌ ప్రభావం 4% మేర ఉండనున్నట్టు వెల్లడైంది. విద్యా వసతుల అంశం 19% మేర ప్రభావం చూపనుంది. శాంతి భద్రతల అంశం 2.9% మేర ప్రభావం చూపనుండగా...అవినీతి నియంత్రణ 12.7% మేర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. మత విద్వేషాల అంశం 24.6% మేర ప్రభావం చూపనుందని తేలింది. అత్యంత కీలకమైన హిజాబ్ వివాదం 30.8% మేర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. 


బీజేపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది..? 


బీజేపీ పనితీరుపై 24,759 మందిపై సర్వే చేయగా...వారిలో 27.7% మంది "బాగుంది" అని, 21.8% మంది "సాధారణం" అని, "బాలేదు" అని 50.5% మంది చెప్పినట్టు  ABP CVoter Opinion Poll వెల్లడించింది. ఇక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై పని తీరుపై సర్వే చేయగా...26.8% మంది బాగుందని, 26.3% మంది సాధారణంగా ఉందని, 46.9% మంది బాలేదని చెప్పారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పని తీరుపైనా సర్వే జరిగింది. ఇందులో 47.4% మంది బాగుందని, 18.8% మంది సాధారణంగా ఉందని, 33.8% మంది బాలేదని వెల్లడించినట్టు సర్వే తెలిపింది. 




ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు..? 


కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకే శివకుమార్ నిలబడతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ...ABP CVoter Opinion Pollలో మాత్రం అందుకు భిన్నంగా సిద్దరామయ్య పేరే వినబడింది. సిద్దరామయ్యకే 39.1% మంది మొగ్గు చూపారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా మరోసారి బసవరాజు బొమ్మైనే కోరుకుంటున్న వారు 31.1% మంది ఉన్నారు. జేడీఎస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా  హెచ్‌డీ కుమారస్వామి బరిలోకి దిగే అవకాశం 21.4% మేర ఉన్నట్టు సర్వేలో తేలింది. డీకే శివకుమార్‌కు ఈ విషయంలో 3.2% మాత్రమే అవకాశాలున్నట్టు వెల్లడైంది. బీజేపీపై అసహనంగా ఉన్న వారు 57.1%గా ఉండగా...ప్రభుత్వం మారకూడదని కోరుకుంటున్న వాళ్లు 25.8% మంది ఉన్నట్టు సర్వే చెప్పింది. మొత్తంగా కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువగా విజయావకాశాలున్నాయని సర్వే చేయగా...బీజేపీకి 34%, కాంగ్రెస్‌కు 39% ఓట్లు పడ్డాయి. జేడీఎస్‌కు 16.6%మేర అవకాశాలున్నాయి. అసలు నచ్చని పార్టీ ఏమైనా ఉందా అని సర్వే చేయగా...ఇందులో బీజేపీకి వ్యతిరేకంగా 33.3%, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 30.5% మంది ఓటు వేశారు.