David Warner DC Captain: త్వరలో  ఐపీఎల్ - 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్  ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.  తమ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయం  కారణంగా ఈ సీజన్‌కు దూరమైన వేళ  కొత్త  సారథిని ప్రకటించింది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన  డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ సారథిగా నియమించింది. ఈ మేరకు  ఢిల్లీ ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన కూడా చేసింది. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అతడికి డిప్యూటీగా ఉండనున్నాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో  ఢిల్లీ క్యాపిటల్స్ కూడా  ఒకటి.  2020 సీజన్ లో ఆ జట్టు ఫైనల్స్‌కు వెళ్లినా  ట్రోఫీ మాత్రం కొట్టలేకపోయింది. ఆ సీజన్ లో శ్రేయాస్ అయ్యర్‌ ఢిల్లీని విజయవంతంగా నడిపించాడు.  కానీ గాయం కారణంగా అతడు తర్వాతి 2021 సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో గత రెండేండ్లు  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఢిల్లీని నడిపించాడు. అయితే గతేడాది పంత్ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో ఢిల్లీకి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయక తప్పలేదు. 


ఇది రెండోసారి..  


కాగా ఢిల్లీకి వార్నర్ సారథిగా చేయడం ఇదేం కొత్త కాదు. 2009 నుంచి  2013  సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడిన వార్నర్.. అప్పుడు కూడా కొన్ని మ్యాచ్ లకు తాత్కాలిక సారథిగా  ఉన్నాడు. తాజాగా  మళ్లీ పూర్తిస్థాయిలో ఢిల్లీని నడిపించనున్నాడు. ఢిల్లీ ఈ ప్రకటన చేసిన వెంటనే   వార్నర్ స్పందిస్తూ.. ‘రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు గొప్ప నాయకుడు.  ఈ సీజన్ లో మేమందరం అతడిని మిస్ అవుతున్నాం. నామీద నమ్మకముంచినందుకు  ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్‌కు కృతజ్ఞతలు.  ఈ  ఫ్రాంచైజీ నాకు హోమ్ వంటిది. టీమ్ లో చాలమంది ప్రతిభావంతులు ఉన్నారు.  రాబోయే సీజన్ లో వీరందరితో కలిసి  పనిచేయబోతున్నందుకు ఎగ్జయిటింగ్ గా ఉంది..’అని తెలిపాడు. 


మెంటార్‌గా గంగూలీ.. 


ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈసారి మెంటార్‌,(డైరెక్టర్ ఆఫ్ క్రికెట్)గా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ పనిచేయనున్నాడు. 2019లో కూడా దాదా ఈ బాధ్యతలు నిర్వర్తించాడు. హెడ్‌కోచ్ రికీ పాంటింగ్, మెంటార్ గంగూలీలు వారి అనుభవాన్ని టీమ్‌కు పంచి  రాబోయే సీజన్‌లో మంచి విజయాలు అందించాలని  ఢిల్లీ  క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించాడు.  ఇటీవల సౌతాఫ్రికాలో నిర్వహించిన ఎస్ఎ 20 లో (ప్రిటోరియా క్యాపిటల్స్), యూఏఈలో  ఇంటర్నేషనల్ టీ20 లీగ్  లలో తమ జట్లకు మంచి ఆదరణ లభించిందని.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా తమ జట్టుకు  అభిమానుల మద్దతు దక్కుతున్నందుకు సంతోషంగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్  ప్రకటనలో పేర్కొంది. కాగా  ఐపీఎల్ -16 లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ను మార్చి 31న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది.