Rajvardhan Hangargekar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ రాజ్‌వర్థన్ హంగర్గేకర్‌ను జట్టులోకి తీసుకుంది.


రాజ్‌వర్థన్ హంగర్గేకర్‌ వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రాజ్‌వర్థన్ హంగర్గేకర్‌ నిలిచాడు. ఈ విషయంలో 18 ఏళ్ల వయసులో చెన్నై తరఫున అరంగేట్రం చేసిన అభినవ్ ముకుంద్ పేరు మొదటి స్థానంలో ఉంది.


రాజ్‌వర్థన్ హంగర్గేకర్‌ గురించి చెప్పాలంటే అతను మహారాష్ట్ర ఆటగాడు. భారత అండర్-19 జట్టులో కూడా సభ్యుడు. ఇప్పటి వరకు రాజ్‌వర్థన్ హంగర్గేకర్‌ తన కెరీర్‌లో మొత్తం ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను ఐదు వికెట్లు పడగొట్టాడు.


బెన్ స్టోక్స్‌కు కూడా చెన్నై జట్టులో చోటు
ఈ మ్యాచ్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే, బెన్ స్టోక్స్ కూడా అందులో చోటు సంపాదించాడు. అతను మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ఆడబోతున్నాడు. ఇది కాకుండా గాయం కారణంగా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన దీపక్ చాహర్ కూడా జట్టులో ఉన్నాడు.


చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ కాయిన్‌ను గాల్లోకి ఎగరేశాడు. ధోని హెడ్స్ ఎంచుకున్నాడు. కానీ టెయిల్స్ పడింది. దీంతో టాస్ గుజరాత్‌కు దక్కింది.


గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 2022ను గుజరాత్ గెలుచుకుంది. అది వారి మొదటి ఐపీఎల్ సీజన్ కావడం విశేషం. మొదటి సీజన్‌లో కూడా గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి కూడా గుజరాత్ చాలా బలంగా ఉంది.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్


సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
ఆర్ సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్


సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
తుషార్ దేశ్‌పాండే, సుభ్రంషు సేనాపతి, షేక్ రషీద్, అజింక్య రహానే, నిషాంత్ సంధు