Mlc Jeevan Reddy : దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేస్తే.... స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రతను కాపాడడానికి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ డీసీసీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా ఏకం చేయడానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని దానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక నరేంద్ర మోదీ.... రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నిరుపేద కుటుంబాలు బాగుపడడానికి కావలసిన ఒక్క పని కూడా చేయలేదు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకురావడంలో విఫలం అవ్వడమే కాకుండా బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలకు, లలిత్ మోదీ, నీరవ్ మోదీలకు అండగా నిలిచే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు జీవన్ రెడ్డి. మోదీ అధికారంలోకి రాకముందు రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో ఉన్న అదానీ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు పెరగడానికి మోదీయే కారణమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రైవేట్ రంగ సంస్థలలో పెట్టుబడులు పెట్టించి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారని, అదానీ షెల్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వ సంస్థలు నష్టానికి గురికావడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాని గురించి పార్లమెంటులో రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి ఏ విధంగా బోగస్ కంపెనీలకు అన్ కౌంటెడ్ మనీ రూ. 23 వేల కోట్లు ఏ విధంగా పెట్టుబడులు పెట్టారో అన్న విషయాన్ని ప్రశ్నిస్తారని జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయకుండా ఆపడానికి.... పార్లమెంటులో ఆపడానికి రాహుల్ గాంధీ మాట్లాడకుండా చేశారని అన్నారు జీవన్ రెడ్డి.
శిక్ష పడిన 24 గంటల్లోనే సభ్యత్వం రద్దు
"ఎప్పుడో గత శాసనసభ ఎన్నికలలో కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలను తీసుకొని కేసు పెట్టారని, ఆ సమయంలో లలిత్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెట్టుబడులు దారి మళ్లించారని, నీరవ్ మోదీ ఐపీఎల్ కుంభకోణంలో పాల్గొని దేశం నుంచి పారిపోయారని వారికి అండగా నిలబడిన మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దొంగలందరికీ మోదీ ఇంటి పేరు ఎందుకు ఉంటుందో అని రాహుల్ గాంధీ కర్ణాటకలో అన్నారు. ఈ విషయంపై గుజరాత్ లో పూర్ణేష్ మోదీ అనే బీజేపీ నాయకుడు 2019లో సూరత్ కోర్టులో 504 కేసు నమోదు చేశారని, ఆ కేసు చివరికి వచ్చిన సమయంలో పూర్ణేష్ మోదీనే హైకోర్టుకు వెళ్లి కేసుపై స్టే తీసుకువచ్చారని, కానీ ఆ కేసులో నిందితుడిగా పేర్కొన్న రాహుల్ గాంధీ స్టే తెచ్చుకోవాలి. కానీ ఆశ్చర్యంగా కేసు నమోదు చేసిన ఫిర్యాదుదారుడు పూర్నేష్ మోదీనే హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు పార్లమెంటులో అదానీ మోదీకి ఉన్న సంబంధం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే తీసుకున్న స్టేని పూర్ణేష్ మోదీ విత్ డ్రా చేసుకొని ఒక నెలలోనే రాహుల్ గాంధీకి శిక్ష పడే విధంగా చేశారు. రాహుల్ గాంధీ అనుకుని ఉంటే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునేవారు, వాయిదాలకు వెళ్లేవారు. కానీ ఒక చట్టం పట్ల గౌరవమున్న వ్యక్తిగా రాహుల్ గాంధీ ఎలాంటి స్టేలకు వెళ్లలేదు. పార్లమెంటులో సభ్యత్వం రద్దు చేయడానికి రెండు సంవత్సరాల శిక్ష సూరత్ కోర్టు శిక్ష వేస్తూ బెయిల్ ఇచ్చిన కూడా 24 గంటలు గడవక ముందే పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు. రాజకీయ జీవిత అనుభవంలో ఇలాంటి సందర్భం ఎప్పుడు చూడలేదని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. ఈ విషయాన్ని విపక్ష పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాయి."- జీవన్ రెడ్డి
ఇళ్లు ఖాళీ చేయమనడం కుట్రపూరిత చర్య
రాహుల్ గాంధీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఏప్రిల్ 22 లోగా ఇళ్లు ఖాళీ చేయమనడం అనేది కుట్రపూరిత చర్య అని జీవన్ రెడ్డి అన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.72,000 కోట్ల రుణమాఫీని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, రైతు కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారులకు రూ.12 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారన్నారు. బడా వ్యాపారులే అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మరి రైతులు ఎలా చెల్లిస్తారని, రైతులకు రుణమాఫీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి పడుతున్నాయని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర లేదు, రైతులు నష్టపోయే విధంగా నల్ల చట్టాలు రూపొందించారని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర రూ.106 ఉంటే కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ రూ. 70, డీజిల్ రూ. 50కి అందించామన్నారు. బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర రూ. 60 ఉంటే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్, ధరలు తగ్గించకుండా డీజిల్ 100 రూపాయలకు, పెట్రోల్ 110 రూపాయలకు పెంచిందన్నారు.