Lucknow IPL Team, IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగులో మరో కొత్త జట్టు అధికారికంగా ప్రవేశించింది. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపునకు చెందిన లఖ్‌నవూ ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్ ఖాతాను ఆరంభించింది. తమ జట్టుకు ఓ అద్భుతమైన పేరును సూచించాలని అభిమానులను కోరుతోంది. ఈ మేరకు అభిప్రాయ సేకరణ చేపట్టింది. మీకేమైనా మంచి పేరు తడితే వెంటనే వారికి సందేశం పంపించొచ్చు.
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు మాత్రమే ఉండేవి. ఈ ఏడాది నుంచి పది జట్లతో లీగ్ జరగనుంది. లఖ్‌నవూ, అహ్మదాబాద్ కేంద్రాలుగా రెండు కొత్త ఫ్రాంచైజీలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపునకు చెందిన ఫ్రాంచైజీ వేగంగా పనులను చక్కబెట్టేస్తోంది. అధికారిక ట్విటర్‌ను ఆరంభించింది. మెంటార్లు, కోచ్‌లను ఎంపిక చేసుకుంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకుంది. ఆండీ ఫ్లవర్‌ను హెడ్‌కోచ్‌గా ఎంపిక చేసింది. మిగతా సిబ్బందినీ వేగంగా నియమించుకుంటోంది.
టీమ్‌ఇండియా యువ కెరటం కేఎల్ రాహుల్‌ను ఆ జట్టు కెప్టెన్‌గా ఎంచుకోబోతోందని సమాచారం. రెండేళ్లుగా అతడు పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. అతడిని మొదటి ఎంపికగా రీటెయిన్ చేసుకొనేందుకు పంజాబ్ ప్రయత్నించినా తిరస్కరించాడు. వేలంలోకి వెళ్తానని చెప్పాడు. ఇక సన్‌రైజర్స్ తురుపు ముక్క రషీద్ ఖాన్ సైతం లఖ్‌నవూకే ఆడబోతున్నాడని సంకేతాలు వస్తున్నాయి.
ట్విటర్లో ఖాతా తెరిచిన లఖ్‌నవూ జట్టు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసింది. జట్టుకు అద్దిరిపోయే పేరు సూచించాలని అభిమానులను కోరుతోంది. వరుసగా ట్వీట్లు చేస్తోంది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది. #ipl2022, #LucknowIPLTeam పేర్లతో హ్యాగ్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఇక మరో కొత్త ఫ్రాంచైజీ అప్‌డేట్స్ తెలియాల్సి ఉంది.