నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏను క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన భారత ఒలింపిక్ సంఘం... ముగ్గురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్యను నడిపించేందుకు భారత ఒలింపిక్ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత వుషు సంఘం అధ్యక్షుడు భూపిందర్ సింగ్‌ను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది. హాకీ ఒలింపియన్ ఎంఎం సౌమ్య, మాజీ షట్లర్ మంజుషా కన్వర్.. కమిటీలో సభ్యులుగా ఉంటారు. నిబంధనలను పాటించనందుకు డబ్ల్యూఎఫ్‌ఐని క్రీడల మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఒలింపిక్స్ జరిగే సంవత్సరమని.. ఇప్పటి నుంచే సన్నాహాలు ఆరంభించాలని.... మేం త్వరలో అన్ని సీనియర్, జూనియర్ ఛాంపియన్‌షిప్స్ నిర్వహిస్తామని భూపిందర్‌సింగ్ తెలిపారు. శిబిరాలూ ఉంటాయని.. పారిస్ ఒలింపిక్స్‌లో వీలైనన్ని ఎక్కువ పతకాలు గెలవాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించాడు.
కొనసాగుతున్న మద్దతు..
భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నికవడంతో వివాదం కొనసాగుతోంది. సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో దిగ్గజ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధాని కార్యాలయం ఎదుట ఉన్న ఫుట్ పాత్ పై పెట్టి పునియా నిరసన వ్యక్తం చేశారు. తాము గతంలో 40 రోజుల పాటు తీవ్రంగా ఉద్యమం చేశామని అందులో బ్రిజ్ భూషణ్ తన పలుకుబడితో తమని అణిచివేశారని ప్రధానిని ఉద్దేశిస్తూ బజ్ రంగ్ పునియా లేఖను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెజ్లర్లకు దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతుగా నిలవగా... తాజాగా సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు బ్రిజ్‌భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్‌సింగ్.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ తన ఖేల్‌రత్న అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నిర్ణయించుకుంది. ప్రభుత్వం రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేసినప్పటికీ ఆమె ఇలా స్పందించింది. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వినేశ్ ఫొగాట్ పేర్కొంది. లేఖను ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తన జీవితంలో ఈ అవార్డులకు విలువ లేదని పేర్కొంది. సంజయ్ సింగ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజ్‌రంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను త్యజించారు.