INDW Vs PAKW: మహిళల టీ20 వరల్డ్ కప్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్జ్ (53 నాటౌట్: 38 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.


150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (33: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు), యస్తిక భాటియా (17: 20 బంతుల్లో, రెండు ఫోర్లు) మొదటి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన స్మృతి మంథన స్థానంలో జట్టులోకి వచ్చిన యస్తిక భాటియా కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపించింది.


యస్తిక భాటియా అవుటైన కాసేపటికే షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ (16: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుటయ్యారు. అయితే జెమీమా రోడ్రిగ్జ్ (53 నాటౌట్: 38 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), రిచా ఘోష్‌ (31 నాటౌట్: 20 బంతుల్లో, ఐదు ఫోర్లు) మరో వికెట్ పడకుండానే మ్యాచ్‌ను ముగించారు. చివరి నాలుగు ఓవర్లలో టీమిండియా విజయానికి 41 పరుగులు అవసరం కాగా, వీరిద్దరూ కేవలం మూడు ఓవర్లలోనే ఛేదించారు. ఈ క్రమంలోనే జెమీమా రోడ్రిగ్జ్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వారి ఇన్నింగ్స్‌కు ఆశించిన ప్రారంభం లభించలేదు. స్కోరు బోర్డుపై 10 పరుగులు చేరేసరికే ఓపెనర్ జవేరియా ఖాన్ పెవిలియన్ బాట పట్టింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ మరో ఓపెనర్ మునీబా అలీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఆ తర్వాత వచ్చిన నిదా దార్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఇక అమీన్ అయితే బోలెడన్ని బంతులు వృథా చేసింది. ఈ నాలుగు వికెట్లు కోల్పోయే సరికి పాకిస్తాన్ స్కోరు 12.1 ఓవర్లలో 68 పరుగులు మాత్రమే.


అయితే వీరి తర్వాత వచ్చిన ఆయేషా నసీం మొదటి బంతి నుంచే చెలరేగి ఆడింది. కేవలం సిక్సర్లు, బౌండరీలు మాత్రమే కాకుండా సింగిల్స్, డబుల్స్‌పై కూడా ఎక్కువ దృష్టి పెట్టడంతో స్కోరు వేగం ఎక్కడా నెమ్మదించలేదు. మరూఫ్  మొదట్లో నిదానంగా ఆడినా తర్వాత తను కూడా చెలరేగి ఆడింది. ఎడాపెడా బౌండరీలు బాదింది.


వీరిద్దరూ ఐదో వికెట్‌కు 47 బంతుల్లోనే అజేయంగా 81 పరుగులు జోడించారు. ఇక చివరి ఐదు ఓవర్లలోనే పాకిస్తాన్ ఏకంగా 58 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.


పాకిస్థాన్ మహిళల తుదిజట్టు
జవేరియా ఖాన్, మునీబా అలీ(వికెట్ కీపర్), బిస్మాహ్ మరూఫ్(కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమాన్ అన్వర్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్


భారత మహిళల తుదిజట్టు
షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్