Indonesia Open 2023:
భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ అద్భుతం చేశాడు! ఇండోనేసియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కడాయి నరవోకాను 21-18, 21-16 తేడాతో చిత్తుచేశాడు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సంచలనం సృష్టించింది. ఒకటో సీడ్ ఫజర్ అల్‌ఫియాన్, మహ్మద్ రియాన్ అర్డియాన్టోను 21-13, 21-13 తేడాతో వరుస గేముల్లో మట్టకరిపించారు. గుంటూరు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్లో లి షి ఫెంగ్ చేతిలో 21-14, 14-21, 21-12 తేడాతో పోరాడి ఓడాడు.
ప్రణయ్ అటాక్
ఈ టోర్నీలో హెచ్‌ఎస్ ప్రణయ్ ఏడో సీడ్‌గా బరిలోకి దిగాడు. క్వార్టర్లో మూడో సీడ్ నరవోకాను ఓడించాడు. మొదటి గేమ్‌లో ఇద్దరూ ఫస్ట్ హాఫ్ వరకు నువ్వానేనా అన్నట్టుగా ఆడారు. 3-3, 5-5, 9-9 వరకు సమంగా పోరాడారు. బ్రేక్ తీసుకున్నాక ప్రణయ్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టాడు. వరుసగా నాలుగు పాయింట్లు అందుకొని 13-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ సిచ్యువేషన్లో పుంజుకున్న జపాన్ షట్లర్ 17-17తో స్కోరు సమం చేశాడు. అయితే ప్రణయ్ వరుసగా మూడు పాయింట్లతో గేమ్‌పాయింట్‌కు చేరుకొని విజయం అందుకున్నాడు. రెండో గేమ్‌లోనూ ఇద్దరూ పట్టువిడువ లేదు. 9-9, 13-13తో సమానంగా ఆడాడు. స్కోరు 17-16తో ఉన్నప్పుడు భారత షట్లర్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.
ప్చ్.. కిదాంబి!
క్వార్టర్లో సాత్విక్, చిరాగ్ డామినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే! 6-6తో స్కోరు సమంగా ఉన్నప్పుడు అటాకింగ్ గేమ్‌తో చెలరేగారు. వరుసగా 6 పాయింట్లు సాధించి 14-7తో ఆధిపత్యం చెలాయించారు. అదే ఊపులో 21-13తో తొలి గేమ్ ఖాతాలో వేసుకున్నారు. రెండో గేమ్‌లోనూ స్కోరు 7-7తో సమమైంది. ఆపై భారత జోడీని ఆపడం ప్రత్యర్థి తరం కాలేదు. వరుసగా 2, 3 పాయింట్లు సాధిస్తూ 21-13తో గేమ్‌తో పాటు మ్యాచునూ కైవసం చేసుకున్నారు. ఇక షిఫెంగ్‌తో మ్యాచులో కిదాంబి ఇబ్బంది పడ్డాడు. తొలి గేమ్‌లో అసలు పోటీ ఇవ్వలేకపోయాడు. రెండో గేమ్‌లో మాత్రం చెలరేగి ఆడాడు. 5-5తో స్కోరు సమం అయ్యాక మళ్లీ అస్సలు అవకాశమే ఇవ్వలేదు. మూడో గేమ్లో 5-4తో వెనకబడ్డ అతడు ఆపై ప్రత్యర్థిని అందుకోలేకపోయాడు. 11-8తో ఉన్నప్పుడు ఫెంగ్ వరుసగా 5 పాయింట్లు సాధించి 16-8తో గేమ్‌ను లాగేశాడు. 21-12తో ఓడించాడు.